రాష్ట్రం ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి, నాగోబా జాతర, కుమురం భీం జయంతి సహా ఇతర గిరిజన పండుగల కోసం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల నిర్వహణకు కోటి రూపాయలు, నాగోబా జాతర, కుమురం భీం జయంతికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. చెంచు బౌరాపూర్ శివరాత్రి జాతర, వరల్డ్ ఇండిజీనియస్ డే కోసం రూ.15 లక్షల చొప్పున, గోండు జంగుబాయ్ జాతరకు రూ.10 లక్షలు, నాయక్ పోడు గాంధారి మైసమ్మ జాతర, ఎరుకల నాచారమ్మ జాతర, ఆంధ్ పులాజీ బాబా జయంతికి ఐదు లక్షల చొప్పున, ఇతర పండగలకు మరో ఐదు లక్షల చొప్పున ఇచ్చినట్లు మంత్రి చెప్పారు.
మొత్తం రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న సత్యవతి రాఠోడ్... నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు జరగనున్నందున జిల్లా కలెక్టర్లు వెంటనే ఉత్సవాల కమిటీలను ఏర్పాటు చేసి, జనాభా వారీగా నిధులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సంత్ సేవాలాల్ మహరాజ్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ఆయన చెప్పిన ఆదర్శాలను పాటిస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చేలా నడుచుకోవాలని కోరారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగే సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని సత్యవతి రాఠోడ్ తెలిపారు.
ఇదీ చదవండి: 'ఫాస్టాగ్ లేకపోతే డబుల్ రుసుం చెల్లించాలి'