రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగ, విద్యావకాశాల్లో స్థానికులకే ఎక్కువ అవకాశాలు లభించేలా కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న 31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా విభజించారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖల్లోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులుగా వర్గీకరించారు. ఆ మేరకు... స్థానిక, జనరల్ కోటాలను విభజించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉంది.
వారికి ఉద్యోగాలు రావాలంటే..
ఆ తర్వాత మరో రెండు కొత్త జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నారాయణపేట.. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగును కొత్త జిల్లాగా ఏర్పాటు చేసింది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఆయా జిల్లా వాసులకే దక్కాలంటే ఆ రెండు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సంబంధిత ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖకు ఇప్పటికే పంపింది.
కేసీఆర్ హామీ మేరకు..
మొదటిజోన్ అయిన కాళేశ్వరం జోన్‌లో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లితో పాటు.. ములుగు జిల్లాను చేర్చాలని ప్రతిపాదించింది. ఏడో జోన్ అయిన జోగులాంబలో... మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌తో పాటు నారాయణపేట జిల్లాను చేర్చాలని ప్రతిపాదించింది. వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్‌లో చేర్చడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేరుస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం..... కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖ పరిశీలించి.. వాటిని పొందుపరుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంది.
అప్పుడే ఆ జిల్లావారికి ప్రాధాన్యత..
50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ దిశగా ఇప్పటికే ఆయాశాఖల్లోని ఖాళీల వివరాలను సేకరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, తదితర కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యమైంది. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభమయ్యేలోపే రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ పూర్తైతే జిల్లా స్థాయి పోస్టుల్లో ఆ రెండు జిల్లాల వారికి ప్రాధాన్యత దక్కుతుంది. లేదంటే అంతకుముందున్న జిల్లాల్లో భాగంగానే పరిగణిస్తారు. అలా కాకుండా నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ కంటే ముందే కేంద్రం నుంచి..... రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్.... ఆ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వీలైనంత త్వరగానే... రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ పూర్తి అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీచూడండి: ఫూలే ఆలోచనా విధానాన్నే ప్రభుత్వం అమలుచేస్తోంది: కేసీఆర్