Telangana Formation Day 2023 KCR Wishes : అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలు దాటుకుంటూ, ప్రత్యర్థుల కుయుక్తులను తిప్పికొడుతూ తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకోవడం అత్యద్భుతమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో, తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలవడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో.. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
KCR Wishes Telangana Decade Day : ఆరు దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా నిలిపిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, అధిగమించిన అడ్డంకులను కేసీఆర్ గుర్తుకు తెచ్చుకున్నారు. అన్ని వృత్తులను, అందరి భాగస్వామ్యం, సహకారంతో, శాంతియుత పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియకు సహకరించిన వారందరినీ ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
ఒకనాడు వెనకబడిన రాష్ట్రం.. నేడు అన్ని రంగాల్లో ముందంజ : భారతదేశంలో 29 వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ తొమ్మిదేళ్ల నిలదొక్కుకున్న తీరు అద్భుతమని కేసీఆర్ అన్నారు. ఒకనాడు వెనకబాటుకు గురైన తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో.. తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలవడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్న ఆయన.. తెలంగాణ వంటి పాలన కావాలని.. అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు.
CM KCR Wishes People Of Telangana On Telangana Formation Day : దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది అన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా, పండుగ వాతావారణంలో జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలందరూ వాడవాడలా సంబురాలు జరుపుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇవీ చదవండి :