New fire Prevention Measures in Telangana : అగ్ని ప్రమాదాలు... వరదల కారణంగా ముంపు... భూకంపాలు...ఇలా విపత్తలు ఏవి సంభవించినా బాధితులను సురక్షితంగా కాపాడడంలో ముందుంటుంది అగ్నిమాపక శాఖ. ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజలను రక్షించడమే మొదటి కర్తవ్యంగా విధులు నిర్వహిస్తూ ఉంటారు ఈ శాఖ సిబ్బంది. యావత్ ప్రపంచం సాంకేతికతను ఒడిసిపడుతూ పనులను సులభతరం చేసుకుంటున్న నేపథ్యంలో దానికి తామెందుకు అందుకు మినహాయింపు అనుకుంది రాష్ట్ర అగ్నిమాపక శాఖ. ఇందుకోసం కైట్ ఐ సాంకేతికతను వినియోగించుకుంటోంది.
New Technology Equipments in Fire Department : సాధారణంగా అగ్నిప్రమాదాలు జరిగినపుడు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వీలైనంత వేగంగా చేరుకోవడం... ప్రమాదాన్ని నివారించడంలో చేయాల్సిన మొదటి పని. ప్రమాద తీవ్రతను బట్టి అగ్నిమాపక శకటం వేగంగా వెళ్లేందుకు కొన్ని సార్లు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి దారి ఇస్తారు. ఎంత వేగంగా స్పందించినా ఒక్కోసారి సిబ్బందికి ఘటనా స్థలికి వెళ్లేందుకు ఆలస్యం అవుతుంది. ఈ ఇబ్బందులు అన్నీ అధిగమించి ఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు ఉపకరించేదే కైట్ ఐ పరిజ్ఞానం. ఈ సాంకేతికతతో అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో ఏం జరుగుతోంది, అగ్నిమాపక శకటాలు మంటలను ఏ మేరకు అదుపు చేస్తున్నాయి, ఘటన స్థలానికి వెళ్తున్న శకటం ఎంత దూరంలో ఉంది తదితర ముఖ్యమైన విషయాలను ఉన్నతాధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. కైట్ ఐ సాంకేతికతతో అగ్నిమాపక సిబ్బంది పని కూడా సులభతరం అవుతుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదాల తీవ్రత కూడా తగ్గింది.
ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడానికి పరికరాలు దోహదం : రాష్ట్రంలో ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా 101 లేదా 100 కు సమాచారం వస్తుంటుంది. ఇది ముందుగా అగ్నిమాపక శాఖ కంట్రోల్ కేంద్రానికి అందుతుంది. ఇక్కడి సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతం పరిధిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందిస్తారు. అయితే గతంలో అక్కడి సిబ్బంది ఎలా స్పందించారనే దాని పై సరైన స్పష్టత ఉండేది కాదు. శకటాల సిబ్బంది ఇచ్చే సమాచారమే ఉన్నతాధికారులకు, బాధితులకు ఆధారంగా ఉండేది. అయితే కైట్ ఐ పరిజ్ఞానంతో అగ్నిమాపక కేంద్రంలో ఉండి ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షించవచ్చు. దీని ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం కూడా పెరుగుతోంది. కైట్ ఐ సాంకేతికతలో భాగంగా మొదట హైదరాబాద్ పరిధిలోని పలు శకటాలకు జీపీఎస్ పరికరాలను అమర్చారు. దీని వల్ల శకటం ఏ సమయంలో ఎక్కడుంది, ఏ వైపు ప్రయాణిస్తోంది, అసలు కదులుతుందా, ఆగి ఉందా వంటి వివరాలన్నీ ఫైర్ కంట్రోల్ కేంద్రంలో తెర పై కనిపించేలా ఏర్పాటు చేశారు. అగ్నిమాపక కేంద్రం అధికారి నుంచి డిజి వరకు చరవాణుల్లోను, మ్యాప్‌ల రూపంలోనూ ఇవన్నీ కనిపించే సదుపాయం ఇందులో ఉంది.
విశేషంగా సాయం అందిస్తోన్న 'కైట్ ఐ' పరిజ్ఞానం : మొదట హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన కైట్ ఐ సాంకేతికత విజయవంతం కావడంతో రాష్ట్రం అంతటా దీనిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 138 అగ్నిమాపక కేంద్రాల్లో దీనిని వాడుతున్నారు. దీని పని తీరుపై అగ్నిమాపక శాఖ అధికారులు మొదలు సిబ్బంది వరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలకు సంబంధించి ప్రతి రోజు ఫైర్ కంట్రోల్ 120 నుంచి 160 ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అదే హైదరాబాద్‌లో అయితే 30 నుంచి 40 కాల్స్ వస్తుంటాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో 30 కాల్స్ వస్తుండగా, హైదరాబాద్‌లో 10 నుంచి 15 కాల్స్ వస్తున్నాయి. వీటన్నింటికీ వేగంగా స్పందించి ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు కైట్ ఐ విశేషంగా సాయం అందిస్తోంది.
పోలీస్ కమాండ్ కంట్రోలో కేంద్రం తరహాలో ఫైర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం : తెలంగాణ పోలీసు శాఖ తరహాలో అగ్నిమాపక విభాగం కూడా మరిన్ని ఆధునిక సౌకర్యాలను సమకూర్చుకుంటోంది. బంజరాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం తరహాలో నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో అధునాతన ఫైర్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక అగ్నిమాపక కేంద్రం, సువిశాలమైన సమావేశ మందిరం, భారీ తెర వంటి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మహానగరంలో భారీ బహుళ అంతస్థుల భవనాలున్నాయి. పై అంతస్థుల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అక్కడికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా ఉంటుంది. దీనికోసం బ్రాంటో స్కై లిఫ్ట్‌ను ఉపయోగిస్తున్నారు. కింది అంతస్థుల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు పై అంతస్థుల్లో ఉన్నవాళ్లు ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి అంతస్థుకు చేరుకుంటారు. వాళ్లను రక్షించడం కూడా కష్టసాధ్యం. మంటల వల్ల పైకి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో స్కై లిఫ్ట్ సాయంతో బాధితులను కిందికి తీసుకొస్తున్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాల్లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలను కూడా రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. రోబో టెక్నాలజీ, వాటర్ టవర్స్, డ్రోన్ ద్వారా మంటలు అదుపులోకి తేవడం వంటివి ఇతర నగరాల్లో వినియోగిస్తున్నారు. వీటిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇలా అన్నింటా ఆధునిక హంగులు అద్దుకుంటూ రాష్ట్ర అగ్నిమాపక శాఖ సరికొత్తగా ముందుకు సాగుతోంది.
ఇవీ చదవండి :
- Fire Accident at Secunderabad : సికింద్రాబాద్‌లో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు
- Falaknuma Express Fire Accident Update : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ఉన్నతస్ధాయి విచారణ ప్రారంభం
- Fire Broke Out in a Car at Sadashivapet : కారులో అకస్మాత్తుగా మంటలు.. అందులో ఏడుగురు.. చివరకు..!