ప్రభుత్వం ప్రకటించిన రుణాలు పత్తి, వరి పంటలకు మాత్రమే సరిపోతాయని, మిగిలిన పంటలు వేసుకున్న రైతులకు రుణాలు లభించే అవకాశం ఉండదని తెలంగాణ రైతు సంఘం కమిటీ స్పష్టం చేసింది. కరోనా కష్టకాలంలో అర్హులైన రైతాంగానికి స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని ఆ సంఘం కార్యదర్శి టీ సాగర్ తెలిపారు. వానాకాలం సాగు ప్రారంభమై నెల రోజులు గడిచిన తరువాత ప్రభుత్వం రుణ ప్రణాళికను ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రిజర్వ్ బ్యాంకు గతంలో చెప్పిన దాని కంటే తక్కువగా వ్యవసాయ రంగానికి రుణ కేటాయింపులు చేయడం జరిగిందని ఆరోపించారు.
ఇదే రీతిలో అమలు జరిగితే రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అప్పుల బారిన పడి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరంపర కొనసాగుతుందని వివరించారు. ఇది ఆగాలంటే కనీసం రిజర్వ్ బ్యాంక్ చెప్పిన నిబంధనల ప్రకారం నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన రైతులకు స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.