Letter to KRMB: ఆర్డీఎస్ కుడికాల్వ పనుల పరిశీలన కోసం ఓ బృందాన్ని పంపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్ తీర్పు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడికాల్వ పనులను చేపట్టిందని లేఖలో ఫిర్యాదు చేశారు. రెండో ట్రైబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించడం, కేంద్ర జలశక్తిశాఖ అనుమతి వచ్చే వరకు ఆర్డీఎస్ కుడి కాల్వను ఏపీ చేపట్టరాదని పేర్కొన్నారు.
జనవరి నెలలో కృష్ణా బోర్డు బృందం పర్యటన షెడ్యూల్లో ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఉన్నప్పటికీ.. అప్పుడు సభ్యులు అక్కడకు వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడంలో విఫలమయ్యారని ఈఎన్సీ మురళీధర్ లేఖలో వివరించారు. కనీసం స్థానిక విచారణ ఆధారంగా కూడా పనుల స్థితిని నివేదికలో పొందుపర్చలేదని ఆక్షేపించారు. జనవరి నెలలో కృష్ణా బోర్డు బృందం ఆర్డీఎస్ను సందర్శించి ఉంటే కుడికాల్వ నిర్మాణాన్ని నిలువరించేదని ఈఎన్సీ తెలిపారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు బృందాన్ని పంపడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని.. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను కొనసాగించకుండా ఏపీని నిలువరించాలని ఈఎన్సీ మురళీధర్ తన లేఖలో కృష్ణా బోర్డును విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తి.. కేఆర్‌ఎంబీకి ఏపీ ఫిర్యాదు