Telangana Election Campaign 2023 : ప్రచారానికి మరో ఏడు రోజులే మిగిలి ఉండటంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడిగాంధీ.. ఇస్త్రీ చేస్తూ, బ్యాండ్ కొడుతూ.. ప్రచారం నిర్వహించారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాస్కీ సాధారణ ప్రయాణీకుడిగా మెట్రోలో ప్రయాణం చేసి ఓటర్లను కలిశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల మారేడ్‌పల్లి ప్రాంతంలోని కాలనీ, బస్తీలలో ఓట్లు అభ్యర్థించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బీఎస్పీ(BSP) అభ్యర్థి నీలం మధు ప్రచారంలో భాగంగా పాశమైలారం గ్రామంలో పలు దేవాలయాలను దర్శించుకొని.. రోడ్ షో నిర్వహించారు.
TDP Congress Election Campaign in Hyderabad : కుత్బుల్లాపూర్‌లో ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి కేపి వివేకానంద్ మళ్లీ హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి(Congress Candidate) బండి రమేష్ ఇంటింటికి తిరుగుతూ.. ఓటు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తమ గెలుపునకు చిహ్నమని ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయరెడ్డి ప్రచారానికి.. తెలంగాణ టీడీపీ(TDP) నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా.. టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి విజయరెడ్డి నివాళులర్పించారు.
Congress Election Campaign in Khammam : ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చెప్పుల దుకాణం వద్దకు వెళ్లి చెప్పులు కుట్టారు. టీ కొట్టు వద్ద టీ చేసి కార్యకర్తలకు అందించారు. భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యకు మద్దతుగా.. తుమ్మలనాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు. పాలేరులో సీపీఎం అభ్యర్థి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు తండాలలో ప్రచారం నిర్వహించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. ధనిక రాష్ట్రాన్ని పేదల రాష్ట్రంగా చేసిన కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.
'వరాలు ప్రకటించేయ్-ఓట్లు పట్టేసెయ్'-మరి ఓటర్ల ఏ పార్టీ మేనిఫెస్టో వైపు మొగ్గు చూపుతారో?
BRS Election Campaign Today : పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ఇంటింటికి తిరిగి కారు గుర్తు ఓటు వేయాలని కోరారు. రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 11 బొగ్గు గనిలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాగూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి ఎన్నికల ప్రచారం(Election Campaign) ఉదృతం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి.. రైతులకు, మహిళలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రచారంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పని చేస్తుందన్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోసం ఆయన సతీమణి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ(BJP) అభ్యర్థి ప్రదీప్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే.. ఆయన సతీమణి సైతం ప్రచారంలో పాల్గొన్నారు. వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ గడప గడపకు తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు.
అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం
BJP Leaders Election Campaign Today : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందరెడ్జి.. ప్రజలు ఆగం కావద్దని.. ఆలోచించి తనకు ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి రోహిత్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ప్రచారం చేస్తుండగా.. బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్యకు.. మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. నాగార్జున సాగర్ ప్రజలు కేసీఆర్ అబద్దపు హామీలు నమ్మొద్దని.. కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్.. లింగంపేట మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ప్రజలు.. డప్పు చప్పుళ్లు, బోనాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం, శెట్టిపల్లి, టేకుమట్ల, ఎలకంటి, గంగిపల్లి పెగడపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ జోరుగా ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో జోరు పెంచిన ప్రతిపక్షాలు - ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటామంటూ ఓటర్లకు అభ్యర్థన