Telangana Election Campaign 2023 : హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రచార బరిలో దూసుకుపోతోంది. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కార్ రావటం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేటలో వెల్లడించారు. బీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తన విజయానికి సోపానమని ఎమ్మెల్యే దానం నాగేందర్ బంజారాహిల్స్ ప్రచారంలో స్పష్టం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార సభలో మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు.
మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని నిజామాబాద్ అర్బన్‌లో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా ఓట్లు అభ్యర్థించారు. బోధన్‌లో ప్రచారం చేసిన షకీల్.. నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్, బీజేపీలకే పోటీ ఉందని.. కాంగ్రెస్‌కు డిపాజిట్లు సైతం రావన్నారు. వేములవాడలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్.. చలిమెడ లక్ష్మీ నరసింహరావును గెలిపించాలని కోరారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లోని ఓ టీ స్టాల్ వద్ద నన్నపునేని నరేందర్ ఛాయ్ తయారు చేసి ఓటర్లకు అందించారు. 2009కి ముందు భూపాలపల్లిని.. ఇప్పటి అభివృద్ధితో పోల్చుకుని ఓటెయ్యాలని గండ్ర వెంకట రమణారెడ్డి అభ్యర్థించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్ ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు.
బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను వివరిస్తూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను జనంలోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యమని.. ముషీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. నిరుద్యోగులను, ప్రజలను మాయమాటలతో బీఆర్‌ఎస్ మోసం చేసిందని జనగామ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. పది సంవత్సరాలు తుపాకీ రాముడి కథలు చెప్పిన కేసీఆర్.. రూ.లక్ష కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. ఓటర్లను ఆకర్షించేందుకే ఎన్నికల ముందు రైతుబంధు డబ్బులు వేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైందని అలంపూర్‌లో హస్తం నేతలు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మహిళలు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌కు చెందిన చిన్నారి శ్రీనిత్య దాచుకున్న రూ.4791 జీవన్‌రెడ్డికి అందించటంతో భావోద్వేగానికి గురయ్యారు.
Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు
అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామంటూ బీజేపీ ఎన్నికల రణంలోకి దిగింది. బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను జనాల్లోకి తీసుకెళ్లి అధికారం కైవసం చేసుకోవాలని కసరత్తులు చేస్తోంది. బీఆర్‌ఎస్ వైఫల్యాలను వివరిస్తూ నిజామాబాద్ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రచారం సాగిస్తున్నారు. మోదీ పథకాలను అర్థమయ్యే రీతిలో వివరిస్తే.. విజయం ఖాయమని భూపాలపల్లి అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి రిజర్వేషన్ కల్పించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేయనున్నట్లు సోషలిస్ట్ పార్టీ-ఇండియా అధ్యక్షురాలు ప్రకటించారు.