రాష్ట్ర ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ప్రసంగం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. వాస్తవ దూరమైన అసత్యాలను గవర్నర్తో ప్రభుత్వం చెప్పించిందని విమర్శించారు. ప్రభుత్వ బడ్జెట్ గణాంకాల్లో లోపాలను కాగ్, 15వ ఆర్థిక సంఘాలు ఎత్తి చూపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అధిక ఆదాయాన్ని చూపించడానికి ప్రభుత్వం గణాంకాలను పెంచేసిందని ఎద్దేవా చేశారు. అందువల్ల వాస్తవ అంచనా వృద్ధి రేటు, తలసరి ఆదాయం వివరాలు నమ్మశక్యం కానీ విధంగా గవర్నర్ ప్రసంగంలో చేర్చారని ఆరోపించారు. 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు, గడిచిన ఆరేళ్లుగా జీఎస్‌డీపీ 114.71 శాతానికి పెరిగిందని ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ఎత్తి చూపారు.
గడిచిన ఆరేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఏజెన్సీల నుంచి తీసుకున్న మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులపై మౌనంగా ఉండిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 20 శాతం మేర అప్పులపై వడ్డీలు, రుణాల చెల్లింపులకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ప్రసంగంలో చేర్చలేదని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తప్పుడు వాదనలు చేయడాన్ని సీఎం కేసీఆర్ మానుకోవాలని షబ్బీర్ అలీ సూచించారు. పెరుగుతున్న నిరుద్యోగం, ప్రభుత్వ విభాగాల్లో లక్షా 91 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఉద్యోగులకు ఫిట్మెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వాగ్దానం చేసిన.. 50 వేల పోస్టుల నియామకం తదితర అంశాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇదీ చూడండి : తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు: కేంద్రం