Telangana Congress Screening Committee Meeting in Delhi : రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రేసుగుర్రాల ఎంపిక కోసం కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయగా.. 5 గంటల పాటు కమిటీ చర్చించింది. కాగా.. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై 3 రోజులుగా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. సర్వేలు, గెలుపు అవకాశాలు ఆధారంగా అభ్యర్థులను వడపోత పడుతున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక, రాజకీయ అంశాల ఆధారంగా.. 119 స్థానాలకు 70కి పైగా స్థానాల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం.
Telangana Congress Screening Committee Meeting Ended : స్క్రీనింగ్ కమిటీ తొలి జాబితాను సిద్ధం చేసి అధిష్ఠానానికి ఇవ్వనుంది. ఆ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌కు మురళీధరన్ ఇవ్వనున్నారు. త్వరలో పార్టీ ఎన్నికల కమిటీ తుది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా అక్టోబర్ తొలివారంలో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వివాదాలు లేని నియోజకవర్గాల జాబితాను తయారుచేసి కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం, ఒకే అభ్యర్థి ఉన్నా.. ఇంకా మెరుగైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Congress MLA Candidates First List 2023 : పీసీసీకి వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ఏఐసీసీ ఎన్నికల కమిటీకి పంపాల్సిన జాబితాపై సుదీర్ఘంగా కసరత్తులు చేస్తోంది. ఏకాభిప్రాయం ఉన్న చోట మినహాయిస్తే.. మిగిలిన చోట్ల పోటీ తీవ్రంగా ఉన్నందున ఎన్నికల వేళ అసంతృప్తులు, రెబల్స్ తయారవకుండా జాబితాను రూపొందేలా దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకరికంటే ఎక్కువ ఆశావహులు పోటీపడే నియోజకవర్గాలపై.. ఇవాళ జరిగే భేటీల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు స్క్రీనింగ్ కమిటీ పరిశీలన ఇవాళ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే తొలి జాబితాను అందిస్తామని ఇప్పటికే పార్టీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Telangana Congress Focus on MLA Candidates Selection : దిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపిక(Telangana Congress MLAs List)ను పూర్తి చేయనుంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ(Pradesh Election Committee) ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు సమాచారం. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా ఈ అభ్యర్థుల ఎంపికను చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ప్రత్యర్థులతో తలపడే శక్తిసామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు సమాచారం. 25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను.. స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ(PEC) సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Tickets 2023 : ఈ మొత్తంగా కలిపి దాదాపు 300 మంది పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసింది. పీఈసీ జాబితా నిశితంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రానుంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానంలో జమిలి ఎన్నికలు(Jamili Elections 2024) వస్తున్నట్లు ప్రచారం అవుతుండటంతో.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee)కే నివేదించనుంది.
పీఈసీ జాబితాను పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి.. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా మొదటి జాబితా(Congress MLA Candidates First List) విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. టికెట్లకోసం పోటీపడుతున్న ఆశావహుల్లో కొందరు దిల్లీ బాటపట్టారు. ప్రధానంగా స్క్రీనింగ్ వద్ద తమ గురించి ప్రస్తావించి టికెట్ వచ్చేటట్టుగా చూడాలని.. ఏఐసీసీ నేతలను(Congress AICC Leaders) ఆశావహులు కోరుతున్నారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ నేపథ్యంలో ఆశావహులు కొందరు.. దిల్లీ వెళ్లి స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో ఉన్నారు.