Telangana congress react on komatireddy venkatreddy comments : కాంగ్రెస్‌లో ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. హంగ్ ఏర్పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకు వెళ్లాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షులు సామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లు... కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఎవరితోనూ పొత్తు ఉండదని వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురిచేసే విధంగా పొత్తుపై మాట్లాడడం సరికాదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధంలేదని అది అయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడించారు.
ఇంతకీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే... రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి తెలిపారు.
'కాంగ్రెస్ అధికారంలో ఉండటం మాత్రం ఖాయం. పార్టీలోని ఏ ఒక్కరితో కాంగ్రెస్‌కు అన్ని సీట్లు కూడా రావు. నేను గెలిపిస్తా అంటే.. మిగిలినవారు ఇంట్లోనే ఉంటారు. నేను స్టార్ క్యాంపెయినర్‌ను.. ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతా? మార్చి మొదటి వారం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాను. పాదయాత్ర ఒక్కటే కాదు... బైకుపై కూడా పర్యటిస్తా. పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ అనుమతి తీసుకుంటాను' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. బీజేపీ సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించి.. కాంగ్రెస్ తనంతట తానే ఎన్నికల బరిలోంచి తప్పుకున్నట్లే అని.. పేర్కొంది.
ఇవీ చదవండి: