Telangana Congress Nominated Posts : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల సమయంలో టికెట్లు త్యాగం చేసిన వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు. అది పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దాదాపు వంద నామినేటెడ్ పదవులు ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనవి ఎవరికి ఇవ్వాలో తేల్చుకోవాల్సి ఉంది.
ప్రధానంగా ఎన్నికల సమయంలో అలకబూనిన నాయకులను బుజ్జగించే క్రమంలో ఎమ్మెల్సీ పదవులతోపాటు రాజ్యసభ పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. రాజ్యసభలో ఖాళీలు లేనందున నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయవచ్చని కాంగ్రెస్(Congress) భావిస్తున్నట్లు తెలుస్తోంది.
"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గాంధీభవన్‌లో జరుగబోతుంది. అసెంబ్లీలో ఎలా అయితే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎలా అధికారంలోకి వచ్చిందో అదే విధంగా ఈ సమీక్ష తర్వాత వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 12 నుంచి 15 సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది." - మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం - మోదీ మెడిసిన్‌కు కాలం చెల్లించింది : సీఎం రేవంత్ రెడ్డి
Parliament Elections 2024 : ఎమ్మెల్సీ(MLC) పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ బరిలో నిలిచిన అభ్యర్ధులకు మద్దతుగా ఉన్న నేతతోపాటు వార్‌రూమ్‌లో పని చేసిన నాయకులు, అసంతృప్తులను బుజ్జగించడంలో కీలకపాత్ర పోషించిన వారికి పదవులు దక్కే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఇప్పటికే పీసీసీ కార్యవర్గంతోపాటు అనుబంధ విభాగాల వివరాలు, ఏఐసీసీ(AICC) వార్ రూమ్‌లో పని చేసి పదవులు ఆశిస్తున్నవారి జాబితా కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం విస్తృతస్థాయి పీసీసీ సమావేశంలో ఈ జాబితాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది.
ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలపై, అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో ఆయన పాలన జనరంజకంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో కర్ణాటక మంత్రులు, స్థానిక నాయకులు, ఏఐసీసీ కార్యదర్శుల ద్వారా నామినేటెడ్ పదవుల కోసం లాబీయింగ్ వేగవంతం చేశారు. అయితే పైరవీలకు తావు లేకుండా నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు.
Telangana Congress : ఈసారి రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సుమారు 15 స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉంది. అందుకు తగ్గట్లుగానే ముందడుగు వేస్తోంది. అందుకు ఈ నామినేటెడ్ పోస్టులు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. దీంతో ఓటు బ్యాంకు కూడా పెరిగే అవకాశం ఉంది.
పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!