Telangana Congress MLA Tickets 2023 : రాష్ట్ర కాంగ్రెస్ వంద అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో 55, రెండో జాబితాలో 45 మంది పేర్లను వెల్లడించింది. మిగిలిన 19 నియోజకవర్గాల్లో నాలుగు సీపీఐ, సీపీఎంలకు కేటాయించగా మిగిలిన 15 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రెండు జాబితాల్లో రెడ్డి సామాజిక వర్గానికి 38 మంది, బీసీలకు 20, ఎస్సీలకు 15, ఎస్టీలకు 8, ముస్లింలకు 4 సీట్లు దక్కాయి. 9 మంది వెలమ, ముగ్గురు కమ్మ, ముగ్గురు బ్రాహ్మణ అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. పది సీట్లు మహిళలకు కేటాయించింది.
Telangana Congress MLA Candidates Second List 2023 : మొదటి జాబితాలో 13 మంది, రెండో జాబితాలో 15 మంది కలిసి 28 సీట్లు.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పోటీకి అవకాశం ఇచ్చారు. చెన్నూరు, కొత్తగూడెం, వైరా, మిర్యాలగూడ స్థానాలు వామపక్షాలకు కేటాయించగా.. మరో 15 నియోజకవర్గాల్లో పేర్లను ప్రకటించాల్సి ఉంది. జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల, నారాయణఖేడ్, పటాన్‌చెరువు, చార్మినార్, సూర్యాపేట, తుంగతుర్తి, డోర్నకల్, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వరావుపేటల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది.
సూర్యాపేటలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా.. మరొకరితో సంప్రదింపులు నిర్వహించి ఏకాభిప్రాయం తీసుకురావాల్సి ఉందని పార్టీ భావిస్తోంది. తుంగతుర్తిలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులను బరిలో నిలపాలా? అద్దంకి దయాకర్‌కే ఇవ్వాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అశ్వరావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణిలు టికెట్లు ఆశిస్తున్నారు.
Congress MLA Candidate List 2023 Caste Wise : సత్తుపల్లి నుంచి మానవతారాయ్, సంభాని చంద్రశేఖర్‌రావులు పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా ఖమ్మం నాయకుల మధ్య ఏకాభిప్రాయం రాక ఆగినట్లు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసేందుకు వెనకంజ వేశారు. నిజామాబాద్ అర్బన్ సీటు మైనార్టీకి ఇవ్వాలని యోచిస్తున్న హస్తం పార్టీ.. రెండుస్థానాల్లోనూ టికెట్లు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. రెండు చోట్ల నుంచి పోటీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనుమతిస్తే కామారెడ్డి నుంచి బరిలో నిలిపి.. షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్‌లో పోటీకి నిలపాలని భావిస్తోంది.
నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్, సంజీవ్‌రెడ్డిలు పోటీ పడుతున్నారు. సంజీవ్‌రెడ్డిని ఎంపిక చేసినప్పటికీ చివర క్షణంలో సమీకరణాలు మారడంతో.. ప్రకటించకుండా నిలిపినట్లు తెలుస్తోంది. పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్‌గౌడ్, నీలంమధు, గాలి అనిల్‌కుమార్‌ల విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఆపినట్లు తెలుస్తోంది.