టీ కాంగ్రెస్ నేతలు ఇవాళ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) కలవనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth reddy)తోపాటు కార్యనిర్వహక అధ్యక్షులు, వివిధ కమిటీల ఛైర్మన్లు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. నూతన పీసీసీ ఏర్పడిన తరువాత రాహుల్ గాంధీని ఒకసారి అందరం కలవాలని ముఖ్యనేతల మొదటి సమావేశంలో రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Pcc Working President Jagga reddy) తెలిపారు.
అప్పుడే రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరగా సోమవారం రాత్రి ఖరారు అయినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. నూతన కమిటీ అంతా మర్యాదపూర్వకంగా కలిసేందుకే రాహుల్ గాంధీ అనుమతి తీసుకున్నట్లు జగ్గారెడ్డి వివరించారు. ఇప్పటికే పలువురు నేతలు దిల్లీ చేరుకోగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ దిల్లీకి బయలుదేరి వెళతారు.
ఇవాళ ఉదయం 10.30 గంటలకు రాహుల్ గాంధీని కలవడానికి అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇదిలా ఉండగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాను దిల్లీకి వెళ్లడం లేదని... తనకు విమానం ఎక్కడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. రైలులో వెళితే సకాలంలో అక్కడికి చేరుకోలేనని విరమించుకున్నానన్నారు. ఆ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి సమాచారం ఇచ్చానని ఆయన మీడియాకు వివరించారు.
ఇదీ చూడండి: RAINS IN TELANGANA: రాష్ట్రంలో వరుణ ప్రతాపం.. వరద నీటితో ప్రజల పాట్లు