Telangana Congress Celebrates Karnataka Win : బీజేపీ మతతత్వ రాజకీయాలను కన్నడ ప్రజలు పూర్తిస్థాయిలో తిప్పికొట్టారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికార పాగా వేయడం ఖాయమని తేల్చి చెప్పారు. కర్ణాటక ఫలితాలు తమకు వెయ్యి ఏనుగుల బలం చేకూర్చిందని రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.
నియంతృత్వానికి, అహంకారానికి దీటుగా కర్ణాటక ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అదే పంథాను కొనసాగించాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్‌కే పట్టం కట్టాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్ణాటక ఫలితాలు బీజేపీకు చెంపపెట్టుగా అభివర్ణించారు.
కర్ణాటక విజయంతో రాష్ట్రంలో సంబురాలు: కర్ణాటకలో కాంగ్రెస్ అధికార పాగా వేయడంపై రాష్ట్రంలోనూ ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. టీపీసీసీ సారథి రేవంత్ రెడ్డి కర్ణాటక కాంగ్రెస్‌నేత డీకే శివకుమార్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజవకవర్గం పరిధి చైతన్యపురిలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమావ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర టపాసులు పేల్చి కార్యకర్తలు నృత్యాలు చేశారు. ములుగులో ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో సంబురాలు జరుపుకున్నారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లోనూ నూతనోత్తేజం నింపాయని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఒక్క అవకాశం అంటున్న కాంగ్రెస్: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే జనరంజక పాలన అందిస్తామన్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. దేశంలోనూ మళ్లీ కాంగ్రెస్ గద్దెనెక్కడం ఖాయమన్నారు. నిజామాబాద్‌లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు డప్పుచప్పుళ్ల మధ్య టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
"కర్ణాటక సమాజం మొత్తం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఓడించడం జరిగింది. కన్నడవాసులు బీజేపీను తిరస్కరించారు. తెలంగాణలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఫలితంగా మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చింది. రెండో విజయం కర్ణాటకలో వచ్చింది.. మూడో విజయం తెలంగాణలో రాబోతుంది." - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
"బీజేపీకి కర్ణాటక ఫలితం చెంపపెట్టులాంటిది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అవినీతి సీఎం కార్యాలయం నుంచి ఎంఆర్వో ఆఫీస్ వరకు వ్యాపించింది." - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: