ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అభ్యర్థులతోపాటు ఆయా డివిజన్ల ఇన్ఛార్జిలు, అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వరదల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినా ప్రభుత్వ పట్టించుకోలేదని.. ముందుచూపు లేకపోవడం వల్లే వరదలొచ్చాయని కాంగ్రెస్ నేతలు విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. తమను గెలిపిస్తే.. ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇచ్చినట్లవుతుందని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలోనూ నగరవాసులపై వరాల జల్లు కురిపించారు. పేద, మధ్యతరగతి ప్రజల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని.. మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్తున్నారు.
పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి... నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హయత్‌నగర్, మన్సూరాబాద్, రామంతపూర్, హబ్సిగూడ తదితర డివిజన్లల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడంలేదని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వరద సాయంలో రెండు, మూడు వేలిచ్చి.. మిగిలిన మొత్తాన్ని తెరాస నేతలు దోచేశారని ఆరోపించారు.
సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న, ప్రజలను పట్టించుకునే వాళ్లను గెలిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెరాస, భాజపాలపై విమర్శలు చేస్తూనే... స్థానిక అంశాలను ప్రస్తావించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలూ.. ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.