ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర ఆర్థిక స్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రస్తుత స్థితిగతులు, కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలపై చర్చించారు.
రాష్ట్ర నిధులకు కేంద్రం కోత
2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా ద్వారా రూ.19,719 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం తన బడ్జెట్లో పేర్కొంది. అయితే గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటాగా రూ.10,304 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే 8 నెలల కాలానికి.. కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ.10,528 కోట్లు. అయితే రూ.700 కోట్లు అధికంగా రావాల్సిన నిధులు రాకపోగా.. మరో రూ.224 కోట్లు తగ్గినందున మొత్తంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ.924 కోట్ల మేర తగ్గింది.
కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం లేఖ
కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని.. ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదో ఒక శాఖలో కాకుండా అన్ని శాఖల్లోనూ ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ తప్ప మరో గత్యంతరం లేదని తెలిపారు. ఐజీఎస్టీ బకాయిలతో పాటు.. జీఎస్టీ పరిహారం రూ.4,531 కోట్లు రాష్ట్రానికి వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం లేఖలో విజ్ఞప్తి చేశారు.
కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోతే... తమకు ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని దిల్లీకి వెళ్లి ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించి ఈ నెల 11న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మంత్రులు, అధికారులకు అందించాలని ఆర్థికశాఖను కేసీఆర్ ఆదేశించారు.
ఇవీచూడండి: ఈనెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం