Telangana Cabinet Sub Committee Meeting: జీవో 58, 59 ఉత్తర్వుల కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేసి.. వారం రోజుల్లో పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం బీఆర్‌కే భవన్‌లో సమావేశమై చర్చించింది.
మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి, పంపిణీకి సిద్ధం చేయాలని ఉపసంఘం అధికారులకు స్పష్టం చేసింది. కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రులు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందాలి: అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూడాలని ఉపసంఘం పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి, వారి జీవితాల్లో ఆనందం నింపాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపైనా సబ్ కమిటి చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది.
రాష్ట్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను వేగంగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంటోంది. అందుకు గానూ కలెక్టర్లకు పూర్తి బాధ్యతలను అప్పగించింది. బస్తా సిమెంట్‌ను రూ. 230కే అందించేలా సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని.. లబ్ధిదారులకు సిమెంట్ అందించనున్నారు. అలాగే ఇందులో గుత్తేదారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా ఈఎండీని 2.5 శాతం ఉన్న దాన్ని 1 శాతానికి పెంచారు. ఎఫ్‌ఎస్‌డీని 7.5 నుంచి 2 శాతానికి తగ్గించారు. మంత్రుల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసుకునేందుకు ఎంపిక కోసం మంత్రి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటిని వేయనున్నారు. ఈ కమిటీలకు కన్వీనర్‌గా కలెక్టర్ ఉండనున్నట్లు మంత్రి వర్గ ఉప సంఘం తెలిపింది.
మంత్రి కేటీఆర్ చేతులు మీదగా ఇళ్ల పట్టాల పంపిణీ: రెండు వారాల క్రితం జీవో 58 ప్రకారం అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీనిని మంత్రి కేటీఆర్ చేతులు మీదగా జరిగింది. ఆరు నెలల క్రితమే.. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగానే పంపిణీ చేశామని పేర్కొన్నారు. 3,619 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఇవీ చదవండి: