రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 30వ తేదీన సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం తదితర అంశాలపై భేటీలో చర్చించనున్నారు. కొవిడ్ నియంత్రణా చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంది. దీంతో లాక్ డౌన్‌ను పొడిగించాలా... లేదా అన్న విషయమై ఆ రోజు నిర్ణయించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, ప్రస్తుత తీవ్రత, పరిస్థితులపై పూర్తి స్థాయిలో చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కొవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స, ఔషధాలు, సదుపాయాలపై కూడా సమావేశంలో చర్చిస్తారు.
ఇంటింటి జ్వర సర్వేపై కూడా కేబినెట్లో సమీక్షిస్తారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమావేశంలో చర్చించనున్నారు. అవసరాలు పెరిగిన దృష్ట్యా వైద్య-ఆరోగ్య, హోంశాఖలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, ఖర్చు తగ్గే శాఖలకు తగ్గింపు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపైనా కేబినెట్లో సమీక్షిస్తారు. గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో కొనుగోళ్లకు ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు.
వానాకాలం పంట సీజన్ ప్రారంభమవుతోన్న తరుణంలో పంటలసాగుపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఈ సీజన్లో కోటీ 40 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు తగ్గట్లుగా విత్తనాలు, ఎరువుల లభ్యతను సమీక్షించడంతో పాటు కల్తీ విత్తనాల నిరోధం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుద్ధరిస్తాం: కేసీఆర్