Telangana Cabinet Expansion : రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ నూతన ప్రభుత్వం పాలనపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూ పాలనను గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కీలకమైన పోస్టుల్లో సమర్థవంతమైన అధికారులను నియమించుకునే దిశలో సీఎం కసరత్తు చేస్తున్నారు.
ఇందులోనూ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నియామకాలు చేస్తున్నారు. సీఎం తన వ్యక్తిగత ముగ్గురు కార్యదర్శుల నియామకంలో ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణ, ఒక మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉండేలా చూసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కీలకమైంది. దీంతో హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Srinivas Reddy), సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబులను నియమించారు.
అదేవిధంగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి రెండు, బీసీ సామాజిక వర్గానికి రెండు, ఎస్టీకి ఒకటి, ఎస్సీకి మరొక మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రెండు మంత్రి పదవులు లభించే అవకాశం ఉండగా యాదవులు, ముదిరాజు మున్నూరు కాపులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కానీ ఇద్దరికీ కానీ మంత్రివర్గంలో చోటు లభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - 54 కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
CM Revanth Reddy Focus on Cabinet Expansion : ఇందులో ఎస్సీకి ఒకటి, మైనారిటీలకు ఒకటి లెక్కన భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కానీ ఎర్రబెల్లి దయాకర్‌పై గెలుపొందిన యశస్వీ రెడ్డికి కానీ లేక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కానీ మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సుదర్శన్ రెడ్డికి, మహిళ కోట కింద యశస్విని రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. సీనియర్ నాయకులు రంగారెడ్డికి మంత్రి పదవి సర్దుబాటు కానట్లయితే చీఫ్ విప్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ?: అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ పదవిని సీఎం రేవంత్ రెడ్డికి తెర వెనుక అన్ని తానై నడిపిస్తున్న పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ(TSPSC) ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీపడుతున్నప్పటికీ పార్టీ కోసం కష్టపడిన నాయకులకు మాత్రమే అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషిస్తున్న హర్కర్ వేణుగోపాలకు ఎమ్మెల్సీ పదవి కానీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా కానీ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Prof Kodandaram as Government Advisor? : ప్రతి అంశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్‌కు ప్రభుత్వ సలహాదారుడు పదవి దక్కే అవకాశం ఉంది. కోదండరాం అనుభవాన్ని రాష్ట్ర పాలనలో భాస్వామ్యం చెయ్యాలన్న ఆలోచనతోనే సీఎం యోచిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలు, మంత్రివర్గ విస్తరణ, కీలకమైన నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు - ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే?
త్వరలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - సీఎస్, నిఘా అధిపతితో సీఎం సుదీర్ఘ భేటీ!