Telangana Budget Sessions 2023-24: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక పద్దుకు ఆమోదం కోసం.. శాసనసభ, శాసనమండలి రేపటి నుంచి సమావేశం అవుతున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. రెండేళ్ల తర్వాత సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
కొత్త సమావేశం కానందున.. గత ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేదు. దీనిపై రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రేగింది. ప్రస్తుతం కూడా గత సమావేశాలను కొనసాగిస్తూ గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేదని మొదట తెలిపారు. అయితే.. తన ప్రసంగం లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మొదట అనుమతి ఇవ్వలేదు.
రేపు ఉభయ సభల సంయుక్త సమావేశం: దీనిపై ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు.. ఇరుపక్షాల న్యాయవాదుల చర్చల అనంతరం రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో.. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అంగీకరించారు. అందుకు అనుగుణంగా రేపు ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుంది.
రేపటి కోసం బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు పంపింది. అయితే దానికి గవర్నర్ ఇంకా ఆమోదముద్ర వేయలేదన్న ప్రచారం ఉంది. అటు సమావేశం నిర్వహణ కోసం సన్నాహకాలు పూర్తి చేశారు. సీఎస్, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వపరంగా వివిధ శాఖల నుంచి ఇవ్వాల్సిన సమాధానాలు, సమావేశాల సన్నద్ధతపై అధికారులతో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఇవీ చదవండి: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే
ఉపాధి హామీకి మొండిచెయ్యి.. బడ్జెట్లో అరకొర నిధులు.. కోట్ల మందికి నిరాశ!