రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతుంటే ప్రధానిపై అసదుద్దీన్ ఒవైసీ చవకబారు విమర్శలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆగస్టు 5 న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేస్తారని తెలిపారు. దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని.. భాజపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వెళ్తున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ ఆలయం హిందువులకు మాత్రమే సంబంధించింది కాదని... భారతీయుల ఆలయమన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రామమందిర నిర్మాణానికి పునాది వేసే అపూర్వ ఘట్టంలో ప్రధాని పాల్గొనడం చారిత్రాత్మక అవసరమన్నారు.
ఇది చదవండి: ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక