Telangana BJP MLA Candidates Second List 2023 : బీజేపీ తమ మొదటి జాబితాలో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకుగాను.. 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
BJP MLA Candidates Second List 2023 : పార్టీలోని కీలక నేతలందర్నీ పోటీలో ఉంచే ఆలోచన నేపథ్యంలో.. అత్యధిక స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల్లో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతుండటంతో.. ఆ స్థానాలపై మళ్లీ కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎంపీల్లో కొందరు ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పార్టీ ముఖ్య నేతలైన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీ.కే.అరుణ, వివేక్ వేంకటస్వామి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పోటీ చేసే అంశంపై స్పష్టత రాలేదు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మినహా మిగిలిన నేతలంతా ఎంపీ బరిలో ఉంటాం తప్ప.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చెన్నూరు, గద్వాల, తాండూరు, మహబూబ్‌నగర్, మునుగోడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
BJP MLA Tickets in Telangana Assembly Elections 2023 : జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కీలక స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట స్థానాలు కీలకం కాగా.. ఆయా చోట్ల బరిలో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. వేములవాడ నియోజకవర్గ టికెట్ కోసం జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, ఇటీవల పార్టీలో చేరిన సీహెచ్.వికాస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తారోనని పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి కూడా పార్టీకి కీలకంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి, సిద్దిపేట టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఒక్కొక్కరే ఉన్నా.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటన అనంతరం కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల అంశంలో స్పష్టత వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. హుస్నాబాద్ టికెట్ హస్తం పార్టీ ఎవరికి ఇస్తుందనే అంశంపై బీజేపీలో చర్చ జరుగుతుండటం గమనార్హం.
BJP Janasena Alliance in Telangana : తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తుపై బుధవారం స్పష్టత వస్తుందని బీజేపీ కీలక నేత ఒకరు పేర్కొన్నారు. దిల్లీలో ఇవాళ.. బీజేపీ అగ్రనేతలు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశమవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం.
ఇందులో పోటీలో ఉండబోయే ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందంటున్నారు పార్టీ నేతలు. జనసేన పార్టీ ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తపరిచారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఇటీవల జనసేన నాయకునితో కలిసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించిన విషయం తెలిసిందే.