Telangana BJP Chief Kishan Reddy Comments on BRS : హైదరాబాద్‌లో సుమారు 10 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల(Double Bedroom House Scheme) కోసం దరఖాస్తు చేసుకుంటే.. కనీసం 100 మందికి కూడా ఇళ్లు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishanreddy) ఆరోపించారు. లక్షలాది మంది దళితులు కనీస ఉపాధి లేక దినసరి వేతనం కోసం ఇబ్బంది పడుతుంటే.. దళిత బంధు అని దళితులను ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని లాలాపేట్-సత్య నగర్ అప్రోచ్ రోడ్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో కాలనీ కష్టాలు తీరాయని కేంద్రమంత్రిని పలు కాలనీల వాసులు సన్మానించారు.
రైల్వే మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి 30 ఏళ్లు సమస్యగా ఉన్న లాలాపేట్-సత్యనగర్ అప్రోచ్ రోడ్డును.. నేటికి పరిష్కరించామని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాను ఎంపీ కాక ముందు కూడా ఇక్కడ రోడ్డు సమస్య ఉండేదని.. అప్పుడు ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. రైల్వే ఆస్తుల పరిధిలో ఉన్న రోడ్లు, దేవాలయాల అభివృద్ధి అంత సులభం కాదని.. కానీ ఆ శాఖతో మాట్లాడి పనులు పూర్తి చేశామన్నారు.
Kishan Reddy on Regional Rail Line at Hyderabad: అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌లో నాలుగు రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టిందని కిషన్‌రెడ్డి అన్నారు. చర్లపల్లిలో మరో టెర్మినల్ నిర్మాణంలో ఉందని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి స్టేషన్‌లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ ఆర్ రోడ్డును రూ.26 వేల కోట్లతో మంజూరు చేశామన్నారు. ఇప్పుడు ఆ రోడ్డు చుట్టూ రిజినల్ రైలు లైన్ కూడా మంజూరైందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పేదలకు ఇంటి వసతి.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని కిషన్ రెడ్డి అన్నారు.
"రోడ్ల మీద ఫ్లైఓవర్లు కడుతూ హైదరాబాద్ మొత్తం సింగపూర్, ఇస్తాంబుల్ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతోంది. హైదరాబాద్‌లోని వేల కాలనీల్లో సరైన రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర వసతులు లేవు. హైదరాబాద్‌లో సుమారు 10 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. కనీసం 100 మందికి కూడా ఇళ్లు రాలేదు. దళితబంధును సొంతవారికి ఇచ్చుకున్నారు." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Kishan Reddy on Ayushman Bharat Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని.. తెలంగాణలోని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తేవడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం అంబర్‌పేట్‌లోని త్రిశూల్ కన్వెన్షన్‌లో సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపులో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ఆయుష్మాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయాలను అందిస్తుంది. కానీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలం అయిందని ధ్వజమెత్తారు.