కరోనా పరీక్షలపై కేంద్రం దృష్టి పెట్టడం వల్ల సీఎం కేసీఆర్ హడావుడి చర్యలు చేపట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కరోనా వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోందని, పరీక్షలు చేసి వ్యాప్తిని అరికట్టాలని ఎంత విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కేవలం మూడు నెలల్లో 39 వేల మందికి మాత్రమే పరీక్షలు చేసిన ప్రభుత్వం... ఇప్పుడు 50 వేల మందికి టెస్టులు చేస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వ్యాధి సోకిన తర్వాతనే ప్రభుత్వానికి తీవ్రత అర్థమైందా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా నియోజకవర్గాల వారీగా టెస్టులు చేయడం సరికాదని, జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే టెస్టులు చేశామని ప్రభుత్వం సాకులు చెబుతోందని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలు ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఉల్లంఘించినట్టా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్భాటపు, హడావుడి చర్యలతో మభ్య పెట్టకుండా చిత్తశుద్ధితో కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.