Telangana Assembly Sessions Live News Today 2023 : విద్యుత్ రంగంపై వాస్తవాలు ప్రజలకు, శాసనసభ్యులకు తెలియాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం ప్రవేశపెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా, వైద్య, సమాచార, సేవా రంగం అభివృద్ధికి నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తే వెన్నెముకని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర మనుగడకు విద్యుత్ రంగ పరిపుష్టి చాలా అవసరమన్న ఆయన, ప్రజల నాణ్యమైన జీవన శైలికి సూచిక విద్యుత్తేనన్నారు. రాష్ట్రావిర్భావం నాటికి ఉన్న ప్రాజెక్టులు, ఆ తర్వాత ప్రారంభించినవి తదితర వివరాలన్నీ శ్వేతపత్రంలో స్పష్టంగా వివరించామన్నారు.
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఛాలెంజ్ - ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Government Released White Paper on Power Sector : అవసరమైన కొత్త ప్రాజెక్టులు తీసుకురాకపోగా, ఉన్న వాటిని కుదేలయ్యేలా చేసిన అప్పులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి డిస్కంలు రూ.10 వేల 783 కోట్ల రుణంతో ఉండగా, ఈ ఏడాది అక్టోబరు నాటికి 39 వేల 457 కోట్లకు చేరాయని, ట్రాన్స్‌కో అప్పులు రూ.2 వేల 911 కోట్లుగా ఉంటే, ప్రస్తుతం రూ.50 వేల 136 కోట్లకు చేరినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. జెన్ కో అప్పులు రూ.7 వేల 662 కోట్ల నుంచి రూ. 31 వేల 923 కోట్లకు పెరిగాయన్నారు. గత ప్రభుత్వ పాలన సక్రమంగా, ప్రణాళికబద్ధంగా లేకపోవడం వల్ల దూరదృష్టి లేక డిస్కంల లోటు రూ.62 వేల 496 కోట్లకు చేరిందన్నారు. వ్యవసాయ సబ్సిడీ అంతరం రూ.18 వేల 725 కోట్లుగా ఉందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం - శాసనసభా వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రావిర్భావం నాటికి జెన్ కో స్థాపిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4 వేల 365 మెగా వాట్లు ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందే 2 వేల 960 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలకు ప్రణాళికలు, పనులను కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కేంద్రాలే విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణకు 1800 మెగా వాట్ల స్థాపిత విద్యుత్ వచ్చేలా పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసిందని భట్టి విక్రమార్క తెలిపారు. అది కూడా ప్రమాణాలకు విరుద్ధంగా సుదీర్ఘ కాలం చేపట్టడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిందని పేర్కొన్నారు. బొగ్గు గనులకు అత్యంత దూరంగా యాదాద్రి థర్మల్ ప్రాజెక్టును చేపట్టిందని, ఇందులో బొగ్గు సరఫరాకే ఏటా రూ.800 కోట్ల అదనపు వ్యయం వస్తోందన్నారు.
ప్రస్తుతం విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. డిస్కంలు రూ.62 వేల 461 కోట్ల నష్టాల్లో ఉన్నాయని, అక్టోబరు 31 నాటికి డిస్కంలు రూ.81 వేల 516 కోట్ల అప్పుల్లో ఉన్నాయని తెలిపారు. జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలే రూ.30 వేల 406 కోట్లు ఉన్నాయని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు రూ.28 వేల 842 కోట్లు చెల్లించాల్సి ఉందని, అందులో సాగునీటి సరఫరా శాఖవే రూ.14 వేల 193 కోట్లని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లు, వాస్తవ సర్దుబాటు కింద గత ప్రభుత్వం రూ.14 వేల 928 కోట్లు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు.
విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి జెన్‌కో స్థాపిత సామర్థ్యం 4365 మెగా వాట్లు. గత ప్రభుత్వం భద్రాద్రి ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసింది. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు. 31 అక్టోబర్ 2023 నాటికి రూ. 81,516 కోట్ల అప్పులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.28,673 కోట్లుగా తేలాయి. రోజువారి మనుగడ కోసమే డిస్కంలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. - భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి
గత ప్రభుత్వ నిర్ణయాలు డిస్కంల ఆర్థిక స్థితిని మరింత కుంగతీసి, రోజువారీ మనుగోడ కోసం అప్పులు చేసే స్థితికి చేర్చాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను అప్పుల ద్వారా సమకూర్చుకోవడం కష్టంగా మారిందన్నారు. విద్యుత్ సంస్థలకు నిధులు, బకాయిల విడుదలలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఆర్థికంగా కుదేలయ్యాయని భట్టి విక్రమార్క అన్నారు.
శ్వేతపత్రం విడుదలను తప్పుపట్టిన అక్బరుద్దీన్ - కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
విద్యుత్ రంగం కుదేలైన స్థితిలో ఉన్నప్పటికీ, వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం అనేక సమస్యలతో వదిలిపెట్టిన విద్యుత్ పరిస్థితిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో తమ వల్లే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరుగుతున్నట్లు గత ప్రభుత్వం వక్రీకరించి చెప్పుకుందన్నారు.
‘గృహలక్ష్మి’ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం - ఆశావహుల ఎదురుచూపులు