Telangana Assembly Sessions 2022 : తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత సమావేశాలు జరుగుతుండడంతో అధికార, విపక్షాలు దృష్టి సారించాయి.తొలిరోజు ప్రశ్నోత్తరాలు ఉండవు. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు నివాళి అర్పిస్తారు. శాసనమండలిలో తొలిరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాల అంశంపై స్వల్పకాలిక చర్చ జరుపుతారు.
అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ)ల సమావేశం జరుగుతుంది. ఇందులో ఈ విడతలో పనిదినాలు, ఎజెండా ఖరారు కానుంది. ఈ నెల 6, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు సభ జరుగుతుందని తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశాల్లో పురపాలక చట్టసవరణ సహా ఆరు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
వాడిగా, వేడిగా జరిగే అవకాశం: రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ వివక్ష, విభజన హామీల అమలులో వైఫల్యం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం తదితర అంశాలపై శాసనసభ వేదికగా తన వాణి బలంగా వినిపించేందుకు అధికారపక్షం సిద్ధమయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో వాడి, వేడి రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు విపక్షాలు రైతుల సమస్యలు, అధిక వర్షాల కారణంగా జరిగిన నష్టం, పోడు భూములు, శాంతిభద్రతలు, వీఆర్‌వో, వీఆర్‌ఏలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించనున్నాయి. శాసనసభ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలనీ కోరనున్నాయి. శాసనసభ, మండలి సమావేశాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలపైనా చర్చించే అవకాశముంది. భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్ మత విద్వేష వ్యాఖ్యలు చేశారని, అనర్హుడిగా ప్రకటించాలంటూ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం ఫిర్యాదు చేసింది.