శాసనసభ రెండు బిల్లులకు ఆమోదముద్ర వేసింది. 39వ జీఎస్టీ కౌన్సిల్లో (GST Amendment Bill))తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా చట్టసవరణ చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది(telangana assembly session). జీఎస్టీకి సంబంధించి ఇస్తున్న నోటిఫికేషన్లు, సర్క్యులర్లు గందరగోళంగా ఉన్నాయన్న కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు... చట్టాన్ని సరళీకరించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. చిన్నచిన్నపొరపాట్ల కారణంగా వాహనాల డ్రైవర్లపై వేధింపులు తగవని అన్నారు. రాష్ట్రం తరఫున పలు అంశాలను లేవనెత్తుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెడుతోందన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... కేంద్రం అన్నింటినీ రాష్ట్రంపై రుద్దుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో వ్యాపారులపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
న్యాయంగా పనులు చేసుకునేవారికి ఇబ్బంది ఉండదు..
పర్యాటకులు, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తన నిరోధించేందుకు చట్టం కోసం బిల్లుపై శాసనసభలో చర్చ జరిగింది. తెలంగాణను అద్భుత, సురక్షిత పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దేలా... పర్యాటకులు, ప్రయాణికులకు పూర్తి విశ్వాసం కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. చట్టం కారణంగా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి చేసుకునే వారికి ఇబ్బంది కలగకూడదన్న మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్... ఒకవేళ పర్యాటకులు నేరాలు చేసే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
లేక్ పోలీస్ తరహాలో పర్యాటక పోలీసును ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు... రాజస్థాన్లో ఈ తరహా ఏర్పాటు మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని... ఫిర్యాదుపై ఎస్ఐ స్థాయి అధికారి విచారణ తర్వాతే కేసు నమోదు చేయనున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. న్యాయంగా పనులు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు.
రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం
జీఎస్టీ చట్టసవరణ బిల్లుతో పాటు టౌటింగ్ చట్టం బిల్లు ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం పొందాయి. స్టాంపు చట్టం సవరణ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభాపతి సభను మంగళవారానికి వాయిదా వేశారు.
ఇదీ చూడండి: Minister KTR on Old City Development: 'వివక్ష లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధే సర్కారు లక్ష్యం'