Telanganan Assembly Elections Result 2023 LIVE Telangana Overall Politics : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన తెలంగాణ అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్ విజయ దుందుంభి మోగించింది. మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలంటూ జనంలోకి వెళ్లిన హస్తం పార్టీ అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేసిన పోరాటంలో కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు జై కొట్టారు.
119స్థానాల్లో జరిగిన పోలింగ్‌లో కాంగ్రెస్ 64స్థానాలతో మిత్రపక్షం సీపీఐ ఒక స్థానంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఆధిక్యం సాధించింది. 2018ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాలతో కలిసి మహకూటమిగా పోటీచేసి 19స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ, ఈ సారి 45స్థానాలు ఎక్కువగా గెలిచింది. ఈ సారి 118స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.
Congress Party Josh in Telangana : హైదరాబాద్ మహానగర పరిధి మినహాయిస్తే జిల్లాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ముందుగా ప్రచారం జరుగున్నట్లుగానే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో దాదాపుగా అన్ని స్థానాల్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పదింటిలో భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు మినహా మిగతా అన్ని స్థానాల్లో హస్తం హవా కొనసాగింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12స్థానాలకు గానూ సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి మినహా అన్నింటా కాంగ్రెస్ గెలిచింది. ఉద్యమం నాటి నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్‌లోనూ 12స్థానాల్లో ఏకంగా 10స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పాగా వేశారు. ఉమ్మడి కరీంనగర్‌లోనూ 13స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా, ఐదుచోట్ల గులాబీపార్టీ అభ్యర్థులు గెలిచారు.
BRS Defeat in Telangana : మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలన్న బీఆర్ఎస్ ఆశలు ఫలించలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి గులాబీపార్టీ తొలి ఓటమి చూసింది. ఈ పార్టీ 37స్థానాల్లో గెలిచింది. మరో రెండింటిలో ముందంజలో ఉంది. పార్టీ బలంగా ఉందని భావించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబీదళానికి ఎదురుదెబ్బ తగిలింది. 54స్థానాల్లో కేవలం 10స్థానాల్లోనే విజయం సాధించింది.
Telangana Election LIVE UPDATES : కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై
ఐతే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీకే ఓటర్లు జైకొట్టారు. హైదరాబాద్ జిల్లాలోని 14 స్థానాల్లో 6స్థానాల్ని గెలుచుకున్న బీఆర్ఎస్, మరో స్థానంలో ముందంజలో ఉంది. ఎంఐఎం ఏడు స్థానాల్లో పట్టు నిలుపుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో తొమ్మిదింటిని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. చేవేళ్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ నాలుగు స్థానాలకే పరిమితమైంది.
Telangana Election Results Live 2023 : తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకున్న బీజేపీ సైతం, రెండు అంకెల స్థానాలకు చేరుకోలేదు. ఐతే హైదరాబాద్ పరిసరాల్లో బలంగా ఉందని విశ్వసించిన పార్టీ అంచనాలు తలకిందులు చేస్తూ, జిల్లాలో గెలవడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆదిలాబాద్‌లో నాలుగు స్థానాలు, నిజామాబాద్‌లో మూడు స్థానాల్లో విజయం సాధించింది.
గోషామహల్ స్థానంలో పార్టీ నిషేధం ఎత్తివేసిన తర్వాత బరిలో నిలిచిన రాజాసింగ్ మరోసారి గెలిచి తన పట్టును నిలుపుకున్నాడు. కామారెడ్డి స్థానంలో సంచలనం ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా బరిలో నిలిచినా ఓటర్లు బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డికే పట్టం కట్టారు. ఓటర్లు ఇచ్చిన తీర్పులో ఆరుగురు మంత్రులకు చేదు ఫలితాలు వచ్చాయి.
Revanth Reddy take oath as Chief Minister Tomorrow : రేపే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం?
నిర్మల్ నుంచి బరిలో నిలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ చేతిలో, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు యశస్విని చేతిలో, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు చేతిలో పువ్వాడ అజయ్‌కుమార్ ఓడిపోయారు. మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోగా, వనపర్తిలో నిరంజన్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి ఓడించారు.
Telangana Election Results Live Updates 2023 : సభాపతిగా ఉంటే ఓడిపోతారనే సెంటిమెంట్ ప్రచారాన్ని తిప్పికొట్టేలా బాన్స్‌వాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన 12మందిలో 9మంది ఓటమి పాలయ్యారు. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్‌రెడ్డి గెలవగా, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు సైతం ఓటమి పాలయ్యారు.
ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద 85,576ఓట్లతో కాంగ్రెస్ హన్మంతరెడ్డిపై విజయం సాధించారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 56,400ఓట్లు, నాగార్జునసాగర్‌లో జైవీర్‌రెడ్డి 55వేల పైచిలుకు, రామగుండంలో రాజ్‌ఠాకూర్ 56వేలకు పైగా ఓట్లతో సమీప ప్రత్యర్థులపై విజయం సాధించారు. నల్గొండలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి 51వేలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 44వేలకు పైగా ఓట్లతో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు 83వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. సిరిసిల్లలో 29వేల ఓట్ల మెజార్టీతో కేటీఆర్ విజయం సాధించారు.
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్