Telangana Assembly Elections Campaignings 2023 : రాష్ట్రంలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల(Telangana ELECTIONS 2023) పోలింగ్ జరగనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణా ప్రారంభమైంది. తొలి రోజే 100 మంది వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ కోసం కొందరు, మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు.
ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు
Assembly Elections Campaign 2023 : ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జనాల్లోనే ఉంటూ ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖ్య నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు, కార్యకర్తలు, తమ అనుచరులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు.
Political Parties Election Campaign : ఈ నేపథ్యంలో పార్టీలకు, అభ్యర్థులకు పెద్ద సంఖ్యలో జనాలను పోగు చేస్తున్నారు. దీంతో రోజువారీ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రచారంలో భాగంగా గ్రామాల నుంచి పట్టణాల దాకా రోజూ పెద్ద సంఖ్యలో అందరికీ భోజనాలు వండుతున్నారు. రోజూ వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి నాయకులే ఆహారం సమకూరుస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వేల మందికి భోజనాలను సిద్ధం చేస్తున్నారు. వీటి కోసం హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆహార సరుకులు కొని నిల్వ చేస్తున్నారు.
నెల క్రితం వరకూ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి భారీగా ఉల్లిగడ్డలు, కూరగాయలు ఇతర సరుకులు రాష్ట్రానికి వచ్చేవి. మహారాష్ట్రకు తూర్పున ఛత్తీస్‌గఢ్‌లోనూ, ఉత్తరాన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో, అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయి. నెల క్రితం వరకూ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి టోకు మార్కెట్‌కు రోజూ 21 వేల క్వింటాళ్లకు పైగా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు సగానికి సగం పడిపోయినట్లు అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు.
‘మా సార్’ ను గెలిపించాలంటున్న మాస్టార్లు, ఇదో కొత్త రకం ప్రచారం
సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం..: మరోవైపు దేశీయంగా అన్ని మార్కెట్లలో నిత్యావసరాలకు గత నెల రోజుల్లో గణనీయంగా డిమాండ్ ఏర్పడిందని టోకు వర్తకులు పేర్కొంటున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంతగా భోజనాలకే రోజూ రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. దీనికి తోడు పెళ్లి ముహూర్తాలు, అయ్యప్ప దీక్షలు, కార్తీక మాసం మొదలవుతుండటంతో ఊరూరా అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఇలా నిత్యావసరాలకు డిమాండ్ పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది.