Telangana Assembly Election 2023 : గత ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి బయటపడి.. ఈసారి ఎన్నికల్లో(Telangana Elections) ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో.. కొందరు నేతలు పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చట్టసభకు ఎంపికై అధ్యక్షా..! అని పిలవాలనే కోరిక ఉండటం సహజం. అలాంటి వారిలో కొందరు ప్రజాక్షేత్రంలో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టి.. సత్తా చాటుతున్నారు. కానీ కొందరు నాయకులు మాత్రం ఓటములు చవిచూస్తున్నారు. ఒక్కసారి ఓడిపోతేనే నిరాశలో కూరుకుపోతాం. కానీ కొంతమంది నాయకులు మాత్రం వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం నిరాశ చెందకుండా.. పట్టుదలతో ఎన్నికల్లో మళ్లీ మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలా రెండుసార్ల కంటే ఎక్కువగా ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగిన అభ్యర్థుల గురించి తెలుసుకుందాం రండి..
కేకే మహేందర్ రెడ్డి : ఈయన సిరిసిల్ల నియోజకవర్గంలో 2009 నుంచి కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారు. 2009లో బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. తనను కాదని సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్‌కు టికెట్‌ను కేటాయించడంతో స్వతంత్రుడిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 171 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరగా 2014లో కాంగ్రెస్ టికెట్ లభించలేదు.. అయినా 2018లో కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని బరిలో దిగితే ఏకంగా 89,009 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం 2023లో కూడా కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతో.. మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు.
ఆది శ్రీనివాస్ : 2009లో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు చేతిలో 1,821 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి 2010 ఉపఎన్నికల్లో మళ్లీ రమేశ్ చేతిలోనే 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి 5,268 ఓట్ల తేడాతోనూ.. 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 28,186 ఓట్ల తేడాతో ఓటమి రుచి చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో.. మరోసారి బరిలో నిలుస్తున్నారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ : 2009లో ధర్మపురిలో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో 1,484 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. మళ్లీ సేమ్ ప్రత్యర్థిపైనే 2014లో 18,679 ఓట్ల తేడాతోనూ.. 2018లో 441 ఓట్ల తేడాతోనూ ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నారు.
తల్లోజు ఆచారి : 2009లో మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ చేతిలో కేవలం 32 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అలాగే 2018లో 344 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కవ్వంపల్లి సత్యనారాయణ : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న ఈయన.. 2009లో మానకొండూరు ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి.. మూడోస్థానంలో నిలిచారు. 2014లో టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచి.. 23,570 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. దీంతో 2018లో టికెట్ దక్కలేదు.
లింగాల కమల్‌రాజ్ : ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మధిర బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మల్లు భట్టి విక్రమార్కను ఢీ కొనబోతున్నారు. 2009లో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచి 1,417 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో 12,329 ఓట్ల తేడాతో మళ్లీ ఓటమిని చవిచూశారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 3,567 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇప్పుడు మళ్లీ భట్టి విక్రమార్క, లింగాల కమల్‌రాజ్ మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుంది.
ఫిరోజ్ ఖాన్ : నాంపల్లిలో ఎంఐఎం పార్టీకి 2009 నుంచి గట్టి పోటీని ఇస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి 6,799 ఓట్ల తేడాతోనూ.. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి 17,710 ఓట్ల తేడాతోనూ ఓటమి చవిచూశారు. 2018లో బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్న ఫిరోజ్‌ఖాన్.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలవనున్నారు.
కె. శ్రీహరిరావు : ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న ఈయన.. 2009లో నిర్మల్‌లో బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచి 35,458 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2014లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి 8,497 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2018లో బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన.. ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో నిలవనున్నారు.
చల్మెడ లక్ష్మీనర్సింహారావు : ఈ ఎన్నికల్లో వేములవాడు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. 2009లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండో స్థానం దక్కించుకున్నారు. 2014లో మూడో స్థానంతో సరిపెట్టుకోగా.. 2018లో కాంగ్రెస్ టికెట్ దక్కనే లేదు.
16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి