GO 317 Issue: జీవో 317 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన తెలిపిన ఉపాధ్యాయులు... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలో చేపట్టిన నిరసనల్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
రేవంత్ మద్దతు...
Revanth on GO 317: 317 జీవోతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాలరాసిందని... తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసనలకు కోదండరాం సహా కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. పలుచోట్ల ఉపాధ్యాయులు చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా సంధ్యతండాలో గుండెపోటుతో చనిపోయిన ఉపాధ్యాయుడు కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. కావాలనే ప్రభుత్వం సమస్యను జటిలం చేస్తున్నాయని మండిపడ్డారు.
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట...
Teachers Protest: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. జీవో 317 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానికత కోటాలో బదిలీలు చేయకుంటే రాష్ట్రం ఏర్పడి ఎందుకని ప్రశ్నించారు. ఇష్టారీతిన పోస్టింగులు ఇవ్వడం దారుణమన్న ఉపాధ్యాయులు... తమకు న్యాయం చేయాలని కోరారు. రోడ్డుపై బైఠాయించడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట...
317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు పోలీసులు అడ్డుకోవడం వల్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. జీవోను సవరించి భార్యాభర్తలకు ఒకే చోటికి బదిలీ చేయాలని ఒంటరి మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
వారున్నప్పుడు వీరుండకూడదా?
ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలను రాష్ట్ర ప్రభుత్వం విడదీసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఆయన మద్దతు పలికారు. ప్రజాప్రతినిధుల భార్యాభర్తలు ఒకే చోట ఉన్నప్పుడు ఉద్యోగులు మాత్రం అలా ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను స్థానికతను కోల్పోయే విధంగా జారీ చేసిన జీఓను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ జీఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాల్సిన అవసరం ఉందని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : Employees Postings: నేడు జోనల్, బహుళ జోనల్ అధికారుల బదిలీలు..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!