Teachers Transfers 2021 : కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు కొంత గందరగోళంగా మారింది. తమను జిల్లాలకు కేటాయించడంలో స్థానికతను పరిశీలించలేదంటూ కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితాను తప్పులతడకగా మార్చి కేటాయింపులు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు ధర్నాలకు దిగుతున్నారు.
సాధారణ బదిలీలకే నెలరోజుల సమయం తీసుకుంటారని, అలాంటిది శాశ్వత కేటాయింపులను హడావుడిగా చేయడంపై విద్యాశాఖ అధికారులే అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. సీనియారిటీ జాబితాను విడుదల చేసి అందులో తప్పులు సరిచేశాక జిల్లాలను కేటాయించాలి. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. కొన్ని జిల్లాల్లో కనీసం జాబితాను విడుదల చేయకుండా అధికారులు జిల్లాలు కేటాయించారు.
జిల్లాల్లో ఆందోళనలు
Transfers Issues in Telangana : సీనియారిటీలో తప్పులున్నాయని, తమకు అన్యాయం జరిగిందని టీచర్లు చెబితే అప్పీలు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. దాన్ని ఎప్పటిలోపు పరిష్కరిస్తారో చెప్పడంలేదు. సీనియారిటీ జాబితాలో తప్పులున్నాయంటూ శనివారం కరీంనగర్, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సిద్దిపేట తదితర జిల్లాల్లో టీచర్లు ధర్నాలకు దిగారు. కరీంనగర్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా తప్పులతడకగా మారింది. ఈ కారణంగా జూనియర్లకు కరీంనగర్, సీనియర్లకు మారుమూల జిల్లాలు దక్కాయి. మార్గదర్శకాలను పక్కనపెట్టి సంగారెడ్డి జిల్లాలో శనివారమే కౌన్సెలింగ్ జరిపారు.
సీనియారిటీని పక్కన పెట్టి..
Employees Transfer Issues in Telangana : తన సీనియారిటీ 420 అని, కరీంనగర్ దక్కాల్సి ఉండగా తనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటాయించారని ఆంగ్లం స్కూల్ అసిస్టెంట్ జి.శంకర్ వాపోయారు. ఆంగ్ల ఉపాధ్యాయులు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 4 ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులున్నాయి. వాటి సీనియారిటీ జాబితా తయారీలోనూ పొరపాటు చేశారు. అభ్యంతరాలను స్వీకరించి తుది సీనియారిటీ జాబితా తయారుచేశారు. కానీ కేటాయింపులో సీనియారిటీని పక్కన పెట్టి జిల్లాలు కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి ఎస్‌ఏ బయోసైన్స్ ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో ఉండాలి. అయితే తనను 258 స్థానానికి చేర్చి... నాగర్‌కర్నూల్‌కు కేటాయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ‘అన్యాయం జరిగిన వారి తరఫున న్యాయపోరాటం చేస్తాం’ అని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతురావు తెలిపారు. శాశ్వత కేటాయింపుల్లో పరిశీలనను ఉరుకులు పరుగులపై చేస్తున్నారని, ఫలితంగా ఎన్నో చిక్కులు ఎదురుకానున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి అభిప్రాయపడ్డారు. ‘సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చేసింది’ అని ఎస్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ ఆరోపించారు.
ఇదీ చదవండి: ఆదిలాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన.. సర్దుబాటు ప్రక్రియపై ఆందోళన