ఏపీకి చెందిన తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి... ఇవాళ విడుదల చేశారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేశారంటూ.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.
తెదేపా నేతల ఆగ్రహం
చింతమనేని అరెస్టుపై తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెట్రో ధరలపై నిరసన తెలపడం నేరమా? ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా?' అని ప్రశ్నించారు. కేసులు, అరెస్టులతో తెదేపా నేతలను అడ్డుకోలేరన్న అచ్చెన్న.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు ఉదంతం ఉదాహరణగా చెప్పవచ్చని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఇంత అవసరమా..? అంతా కావాలని చేసిందే.
మేము, మా కార్యకర్తలం ఎస్సైపట్ల అమర్యాదగా ప్రవర్తించనట్లుగా.. వారికి అధికారం ఉందికదా అని చట్టాన్ని రక్షించాల్సిన రక్షకబటులైన పోలీసులతో కేసు పెట్టించారు. ఇప్పటికే పెదపాడు ఎస్సైగారితో కేసు పెట్టించారు. రూరల్ ఎస్సై గారితో ఇంకో కేసు పెట్టించారు. ఇప్పుడ వాటా దెందులూరు ఎస్సైగారి వంతొచ్చింది. ఇక మా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పెదవేగి ఒక్కటే ఉంది. ఆయన ఎప్పుడు పెడతాడో చూడాలి. వాళ్ల రాక్షసత్వం, రాక్షస పాలన మనం చూస్తున్నాం. నర్సీపట్నం నుంచి వెనక్కి వస్తుండాగా... నిన్న సాయంత్రం అయిదు గంటలకు నన్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరందరూ చూస్తండగానే ఇంటివద్ద విడిచిపెట్టారు. ఇంతదానికి కొండను తవ్వి ఎలుకను పట్టేంత అవసరం ఏమొచ్చింది. నిజంగా ఏమైనా జరిగిందంటే... నా నియోజకవర్గం, నాఇల్లు వదిలి నేను ఎటూ పారిపోలేను కదా.. ఇంత అవసరమా..? కావాలని చెయ్యడం కాకపోతే ఇదంతా.. చింతమనేని ప్రభాకర్, తెదేపా మాజీ ఎమ్మెల్యే.
ఇదీ చూడండి: కార్వీ ఛైర్మన్ పార్థసారథిని రెండో రోజు ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు