TDP Contests in Telangana Elections 2023 : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ కంటే బలంగా ఉందనే విషయాన్ని.. తాము నమ్మడం లేదని అన్నారు.
Kasani Gnaneshwar On Telangana Elections 2023 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆమోదం పొందిన తరవాత అభ్యర్థుల జాబితాతో పాటు.. టీడీపీ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని జ్ఞానేశ్వర్ తెలిపారు. చంద్రబాబు ఆలోచన విధానం.. రాష్ట్రంలో జరిగే అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. ఇప్పటికే 87 మంది అభ్యర్థులతో కూడిన జాబితా తమ వద్ద ఉందని.. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఆమోదం తెలపిన వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. మిగతా పార్టీల నుంచి చాలా మంది నాయకులు టీడీపీలోకి రావాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ప్రచారం చేస్తారని వివరించారు.
TDP Contests in Telangana Assembly Elections 2023 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం రోజున బయటకు వస్తారని కాసాని జ్ఞానేశ్వర్ ఆశా భావం వ్యక్తం చేశారు. బాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయని తెలిపారు. బాబుతో శనివారం ములాఖత్‌లో కలిసి.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని వివరించానని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టామని.. ఆయన నిర్ధోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
"జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మూలఖత్లో మాట్లాడాను. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని వివరించాను. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం. అభ్యర్థుల లిస్ట్‌తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. చంద్రబాబు ఆమోదం పొందిన తరవాత వెల్లడిస్తాం. మంగళవారం రోజున బాబు బయటకు వస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేయనున్నారు." - కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
మరోవైపు జనసేన పార్టీతో రాష్ట్రంలో ముందుకు వెళ్లాలో లేదో భవిష్యత్తులో తెలుస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా పోటీ చేస్తామని.. టీడీపీ ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది..? ఎంత మంది బరిలోకి దిగుతారు..? ఇలాంటి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. టీడీపీ విషయంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.