TCong on agnipath: అగ్నిపథ్ ఒక అనాలోచిత, పేలవమైన పథకమని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇందులో నిరుద్యోగ యువతకు సాయుధ దళాల్లో కేవలం నాలుగు సంవత్సరాల సేవకే హామీ లభించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాయుధ బలగాల్లో కాంట్రాక్టు ఉద్యోగాల ప్రవేశపెట్టేందుకే.. అగ్నిపథ్ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. 'అగ్నిపథ్' అనేది లోపభూయిష్ట పథకమని విమర్శించారు. ప్రస్తుతం రక్షణ పార్లమెంటరీ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. అగ్నిపథ్ విషయంలో భాజపా నాయకులు చెబుతున్న ఉదాహరణలు చెల్లవని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని.. వాటిని మనదేశంతో పోల్చలేమన్నారు.
రాకేశ్ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి: సికింద్రాబాద్‌లో యువకుల పోరాటంలో న్యాయముందని అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా యువకుల ఆందోళనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఉపసంహరించుకోవాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, జి.నిరంజన్, ప్రచారకమిటీ ఛైర్మన్ మధుయాష్కీ మోదీ సర్కారుకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందని, వారిపై ఏలాంటి కేసులు పెట్టొద్దని వారు సూచించారు. తెరాస-భాజపా ప్రభుత్వాలు యువకులతో దాగుడుమూతలు అడుతున్నాయని ఆరోపించారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి కోటి రూపాయిలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తగ్గిన ఉద్రిక్తత.. పట్టాలపై పరుగులు తీస్తున్న మెట్రో రైళ్లు