ఫైనాన్స్ కంపెనీకి రూ.70 లక్షలు టోకరా వేసిన ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని తల్వార్ వోల్వో షోరూం ఎండీ సాకేత్ తల్వార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 86కు చెందిన అబ్దుల్ యాకుబ్ 2019, జూన్ 27న బుద్దభవన్ వద్ద ఉన్న విజయకాంత్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. తాను వోల్వో కారు కొనాలనుకుంటున్నానని... రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. పత్రాలను పరిశీలించిన ఫైనాన్స్ కంపెనీ రూ. 70 లక్షలు రుణం ఇచ్చేందుకు అంగీకరించి... ఆర్టీజీఎస్ ద్వారా రూ. 67.23 లక్షలు తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు జమచేసి మొదటి ఈఎంఐ కింద రూ. 2.76 లక్షలు ఇచ్చింది.
కారును ఇవ్వడంలో సాకేత్ తల్వార్ జాప్యం చేశాడు. ఇదేంటని ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ గులాం అబ్రార్ అలీ... సాకేత్‌ను అడగ్గా తమ మేనేజర్‌ను కలవాలంటూ తప్పించుకోసాగాడు. ఇటీవల కారు కోసం ఆరాతీయగా తమ పేరుపై కేటాయించిన కారును మరొకరికి సాకేత్ విక్రయించారని... గతంలోనూ ఇలాంటి మోసాలు చేశారని తెలిసి షాకయ్యారు. ఫైనాన్స్ సంస్థ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని కొండాపూర్‌లోని ఓ విల్లాలో సాకేత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనితో చేతులు కలిపి మోసానికి పాల్పడ్డ అబ్దుల్ యాకుబ్, ఎంఏ సొహెల్ లపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి : మాస్కులతో దర్శనమిస్తున్న దేవుళ్ల విగ్రహాలు..!