CINE WORKERS: వేతనాల పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న నిరసన కొనసాగుతోంది. రెండోరోజు కూడా వారు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. దీంతో 25కు పైగా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. మరోవైపు సినీకార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపుపై చర్చిస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చెబుతోంది. 15 రోజుల పాటు పాత పద్ధతిలోనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలకు సూచించింది. ఈ నేపథ్యంలో పంచాయితీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు చేరింది.
పంతాలు, పట్టింపులు వద్దని ఇరు పక్షాలకి చెప్పానని మంత్రి తలసాని తెలియచేశారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితులతో కార్మికుల వేతనాలు పెరగలేదని చెప్పారు. మధ్యాహ్నం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించామని తెలిపారు. షూటింగ్‌లపై రెండు పక్షాలు రెండు రకాలుగా మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరిగేలా కూర్చొని మాట్లాడుకోవాలని మంత్రి తలసాని వారికి సూచించారు.
తమ మాటకి కట్టుబడి ఉన్నామని.. షూటింగ్‌లు ప్రారంభమైతేనే వేతనాలపై చర్చిస్తామని నిర్మాత సి.కల్యాణ్ స్పష్టం చేశారు. ఈరోజు కూడా షూటింగ్‌లు జరగడం లేదని.. నిర్మాతలంతా ఎవరితో పనిచేయించుకోవాలో వారితో చేయించుకుంటామని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిరవధికంగా షూటింగ్‌లు ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: సినీ కార్మికుల నిరసన.. షూటింగ్‌లు బంద్.. కారణం ఇదే!