రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గొర్రెల పంపిణీకి త్వరలో విధి విధానాలను ప్రకటించనున్నట్లు పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అవకతవకలు, అక్రమాలు జరగకుండా అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు. గొర్రెల పంపిణీకి బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
విజయ డెయిరీ అవుట్ లెట్లు వెయ్యి ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. త్వరలో దేవాలయాలు, పర్యటక ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. విజయ ఉత్పత్తులను విక్రయించేందుకు 500 తోపుడుబండ్లు కూడా రానున్నాయని అన్నారు. పాడిపరిశ్రమ, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఒకప్పుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ.. ప్రస్తుతం 60 కోట్ల రూపాయల లాభంలో ఉందంటే సీఎం కేసీఆర్ విధానాల ఫలితమేనని కొనియాడారు. విజయ డెయిరీతోపాటు కరీంనగర్, ములకనూరు, నల్గొండ సహకార డెయిరీల టర్నోవర్ 676 కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
హైదరాబాద్లో 150 సంచార చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పట్టభద్రుల ఎన్నికల వల్ల నిలిచిపోయిందని.. త్వరలోనే అవి ప్రారంభం కానున్నాయని తలసాని వెల్లడించారు. పాడి రైతులకు లీటరు పాలకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్కు సంబంధించి.. 39 కోట్ల 34 లక్షల నిధులను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. బకాయిలను కూడా త్వరలోనే చెల్లించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : 53 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్