విధి నిర్వహణలో దుష్ప్రవర్తన, సొమ్ము వసూలు, క్రిమినల్ కేసుల నమోదు, చాలా కాలంగా విధులకు గైర్హాజరు తదితర కారణాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో విధుల నుంచి తొలగింపునకు గురైన హోంగార్డులు 2019, 2020, 2021లో హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వలేదని, వివరణ ఇచ్చినా పరిగనలోకి తీసుకోలేదని, తాము పబ్లిక్ సర్వెంట్ కిందకు వస్తామని, తొలగిస్తూ ఉత్తర్వులిచ్చే అధికారం పోలీసు కమిషనర్, ఎస్పీలకు లేదని, క్రిమినల్ కేసుల్లో తమను నిరపరాధులుగా న్యాయస్థానం ప్రకటించినా విధుల్లోకి తీసుకోలేదని హైకోర్టుకు వారు విన్నవించారు.
సివిల్ సర్వేంట్లుగా..
ఏపీ పోలీసు మాన్యువల్‌లోని ఛాప్టర్ 52లోని నిబంధనలు హోంగార్డులకు వర్తిస్తాయని, వారు అందించేవి కేవలం వాలంటీర్ సేవలని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఏపీ హోంగార్డు చట్టం, ఏపీ ప్రభుత్వం అన్వయించుకున్న మద్రాస్ హోంగార్డ్ చట్ట నిబంధనలు.. రాష్ట్రంలోని హోంగార్డులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. హోంగార్డుల ఎంపిక విధానం, విధుల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే... ఏపీ హోంగార్డు చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం వారు సివిల్ సర్వెంట్లుగా పరిగణించాల్సి ఉందన్నారు. పిటిషనర్లు హోంగార్డులుగా 'సివిల్ పోస్టు'నిర్వహిస్తున్నారన్నారు. అధికరణ 311 (2)ను అనుసరించి విచారణ నిర్వహించాలని స్పష్టం చేశారు. విచారణ చేయకుండా వారిని సర్వీసు నుంచి తొలగించడానికి వీల్లేదని చెప్పారు.
తొలగింపు నిర్ణయానికి వచ్చినప్పుడు సహజ న్యాయసూత్రాల ప్రకారం అందుకు కారణాల్ని పేర్కొనాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కారణాలు పేర్కొనకుండా పిటిషనర్లను విధుల నుంచి తొలగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఎస్పీ, పోలీసు కమిషనర్‌కు హోంగార్డులపై చర్యల కోసం సిఫారసు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. అంతిమంగా తొలగింపు, సస్పెన్షన్‌పై నిర్ణయం ' కమాండెంట్'కు ఉంటుంది. పిటిషనర్లను తొలగిస్తూ ఎస్పీ, పోలీసు కమిషనర్లు జారీచేసిన ఉత్తర్వులు మద్రాస్ హోంగార్డ్ రూల్ 7 (3,4,5) నిబంధనలకు విరుద్ధం. ఏపీ హోంగార్డ్స్ చట్టం ఉనికిలో ఉన్నందునా.. ఏపీ పోలీసు మాన్యువల్, పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ హోంగార్డులకు వర్తించవు.- హైకోర్టు ధర్మాసనం
ఉత్తర్వులు రద్దు..
పిటిషనర్లలో కొంత మంది క్రిమినల్ కేసుల్లో చిక్కుకొన్నారన్న కారణంతో తొలగించడం చట్ట విరుద్ధమైన చర్యని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కోర్టులు పిటిషనర్లను నిర్దోషులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారులు జారీచేసిన ఉత్తర్వుల్లో తొలగింపునకు సంతృప్తికరమైన కారణాలు పేర్కొనలేదని ఆక్షేపించారు. పిటిషనర్లను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. విధులకు చాలాకాలం గైర్హాజరైన విషయంలో పిటిషనర్లు ఇచ్చిన వివరణకు ఎందుకు సంతృప్తి చెందలేదో అధికారులు కారణాలు పేర్కొనలేదన్నారు.
ఇదీ చదవండీ... 'ఏడేళ్లైనా ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం'