ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు బీ కేటగిరీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించకుంటే తమకు కూడా ఇవ్వొచ్చని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) సూచించింది. ఇప్పటికే సీట్లు అమ్ముకుంటున్నారని, దరఖాస్తులు తీసుకోవడం లేదని, దానివల్ల తక్కువ ప్రతిభ ఉన్నవారికి సీట్లు ఇస్తున్నారని పలువురి నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఏదైనా విద్యాసంస్థ దరఖాస్తులు తీసుకోకుంటే మాసాబ్‌ట్యాంకులోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆవరణలోని తమ కార్యాలయంలో వాటిని అందించవచ్చని, వాటిని ఆయా కళాశాలలకు పంపిస్తామని తెలిపింది. ఎంసెట్ కాలపట్టిక ప్రకారమే బీ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలని, వాటిని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలంది.
జేఈఈ ర్యాంకులు వెల్లడించకనే అమ్మకాలు
30 శాతం సీట్లను ఆయా యాజమాన్యాలు బీ కేటగిరీ పేరిట భర్తీ చేసుకోవచ్చు. అందులో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్, తర్వాత ఎంసెట్ ర్యాంకు, చివరగా ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలి. వాటికి కన్వీనర్ కోటా ఫీజు మాత్రమే తీసుకోవాలి. మిగిలిన వాటిని ఎన్‌ఆర్‌ఐ లేదా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్ చేసిన వారికి ఇస్తారు. వాటిని ఏడాదికి 5 వేల అమెరికా డాలర్లు ఫీజు తీసుకోవచ్చు. అంటే 15 శాతం సీట్లకు జేఈఈ మెయిన్ ర్యాంకును మొదట పరిగణనలోకి తీసుకోవాలి. దరఖాస్తుదారుల్లో మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు ఇవ్వాలి. వారూ లేకుంటే ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొని సీట్లను భర్తీ చేయాలి. విచిత్రమేమంటే ఇప్పటివరకు జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కాలేదు. అయితే చాలా కళాశాలలు నిబంధనలకు తూట్లు పొడిచి అమ్మకాలు మొదలుపెట్టాయి. కేపీహెచ్‌పీకి చెందిన ఒకరు తమ కుమార్తెకు బీ కేటగిరీ సీటు కోసం ఓ ప్రైవేట్ కళాశాలకు వెళితే సీట్లు అయిపోయాయని జవాబిచ్చారు. తమ యాజమాన్యానికి చెందిన మరో కళాశాలలో ప్రయత్నించాలని సూచించారు.
నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలా?
బీ కేటగిరీ సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాటిని ఆయా కళాశాలలు భర్తీ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ ర్యాంకులు రానందున ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈనెల 9 లేదా 10వ తేదీన మెయిన్ ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయా కళాశాలలు కూడా కాలపట్టికను పేర్కొంటూ నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: CORONA: థర్డ్‌వేవ్ భయం.... కొలువుకి వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధం!!