T Congress on Assembly Elections 2023 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. కర్ణాటకలో విజయవంతమైన వ్యూహాన్ని ఇక్కడ కూడా అనుసరించాలని పీసీసీ భావిస్తోంది. గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో... రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం, కర్ణాటకలో ఎన్నికల ఫలితాలపై చర్చించారు. కర్ణాటకలో ఫలించిన నాయకుల ఐక్యత, సమష్టి కృషి, సామాజిక న్యాయం, ముందస్తు ప్రచార వ్యూహాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పీసీసీ నిర్ణయించింది. నాయకుల మధ్య సఖ్యత మరింత పెరగాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.
Manik Rao on TS Assembly Elections 2023 : పార్టీ అభ్యున్నతికి తాను ఎన్ని మెట్లయినా దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే పని ఎవ్వరు చేసినా చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే హెచ్చరించారు. పైరవీలతో టికెట్లు రావని... పార్టీ నిర్వహించే సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తామని ఠాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ తెరచాటు స్నేహాన్ని ప్రజలకు వివరిస్తూనే ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నేతలంతా ప్రజల్లోకి వెళ్లి పార్టీపై విశ్వాసం పెంచాలని ఠాక్రే సూచించారు. పార్టీలో కోవర్టులు లేరని.. నేతల మధ్య విభేదాలు లేవన్నారు.
30 శాతం కమీషన్ సర్కార్ నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లాలి : కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఊపు తెచ్చిన 40 శాతం కమీషన్ నినాదాన్ని ఇక్కడా అనుసరించాలని పీసీసీ తీర్మానించింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని 30 శాతం కమీషన్ సర్కార్ అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ ప్రభుత్వ మోసాలను ఎండగడతామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండ గడుతూనే... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పొన్నం అన్నారు.
సమావేశానికి హాజరుకాని సీనియర్లు : పార్టీ పదవులు ఉన్నోళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పార్టీకి నష్టం కలిగించే వారెవరైనా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ డీసీసీలకు ఠాక్రే, రేవంత్ రెడ్డిలు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరు నాటికి మండల, జిల్లా కమిటీలను వేయాలని డీసీసీలకు స్పష్టం చేశారు. మరోవైపు కీలకమైన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డితోపాటు మరికొందరు నేతలు వివిధ కారణాలతో హాజరుకాలేదు.
ఇవీ చదవండి :