Sintex Company will Invest in Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. సింటెక్స్ కంపెనీ (Sintex Company) రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వెల్స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్‌ను.. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తద్వారా సుమారు 1000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌వల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతుంది. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్ వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపోనెంట్స్, ఇతర పరికరాలను తయారు చేయనున్నారు.
ఇందుకోసం ఈ నెల 28న శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. వెల్స్పన్ కంపెనీ ఛైర్మన్ బీకే గోయెంకా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా పునాదిరాయి పడనుంది. ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్స్పన్ గ్రూప్.. మరింత విస్తరించండం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెల్స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో అదనంగా రూ.350 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల వల్ల.. అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు.. తమ కార్యకలాపాలు, పెట్టుబడులు విస్తరించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తెలుసుకున్నారని అన్నారు. ఇందులో భాగంగానే వాటికి అవసరమైన సహాయ సహకారాలు, మౌలిక వసతుల కల్పన సకాలంలో అందించడం వల్ల ఆయా సంస్థలు భారీగా విస్తరిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
సింటెక్స్ కంపెనీ పెట్టుబడిని అహ్వానించిన మంత్రి కేటీఆర్.. ఆ కంపెనీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే వెల్స్పన్ గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా చాలా విజయవంతంగా వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో.. ప్రత్యేకించి విశ్వనగరం హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాతావరణం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉందని అభిప్రాయపడింది. ఈ తరుణంలో తమసంస్థ అధ్వర్యంలో సింటెక్స్ బ్రాండ్ ద్వారా మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని వెల్స్పన్ గ్రూప్ వర్గాలు తెలిపాయి.
KTR Laid Foundation Eurofins Campus : 'ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్'