suspense in AE exam in Telangana : ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలకు నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అవడం అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. పరీక్షపై న్యాయ నిపుణుల సలహాలు, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని కమిషన్ చెబుతోంది.
ఈ విషయంపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి స్పందించారు. ఏఈ పరీక్షను కొనసాగిస్తారా? లేదా రద్దు చేస్తారా అనే విషయంపై మంగళవారం రోజునే నిర్ణయం తీసుకోవాలనుకున్నామని.. కానీ సాంకేతిక కారణాలతో సమావేశం పోస్టుపోన్ చేసినట్లు తెలిపారు. పరీక్షను రద్దు చేస్తే దాని వల్ల ఎదురయ్యే అభ్యంతరాలు, కొనసాగిస్తే వచ్చే వివాదాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏఈ పరీక్ష రద్దు.. కొనసాగింపుపై ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టీఎస్పీఎస్సీలో నమ్మిన వాళ్లే గొంతు కోశారని కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకమైన సంస్థలో పనిచేస్తూ నమ్మకంగా ఉన్న సిబ్బందే హ్యాకింగ్‌కు పాల్పడడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తన పిల్లలు ఎవరూ కూడా గ్రూప్-1 పరీక్ష రాయలేదని స్పష్టం చేశారు. తన మేనల్లుడు రాస్తానంటే తాను ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని వెల్లడించారు. గ్రూప్-1 మెయిన్స్ ను జూన్ 5న యథాతథంగా నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.
టీఎస్పీఎస్సీలో మాస్‌కాపీయింగ్, అవకతవకలు జరిగే అవకాశమే లేదని కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా సుమారు 26 నోటిఫికేషన్లు ఇచ్చామని ఏడు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ నిర్వహించే సమయంలో దురదృష్టవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. పరీక్ష నిర్వహించే ఒకరోజు ముందు తమకు తమ సిస్టమ్ నుంచి సమాచారాన్ని హ్యాక్ చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. రెండు రోజుల్లోనే పోలీసులు విచారణ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేశారన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకుని పరీక్ష రద్దు చేయాలా ? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని జనార్దన్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: