నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పునర్నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా.. స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో ప్రతి విషయం తమకు తెలుసన్న సీజేఐ.. కావాలనే స్టే ఇవ్వట్లేదన్నారు. గవర్నర్ లేఖ పంపినా.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణంగా అభివర్ణించారు.
నిమ్మగడ్డ ధిక్కరణ పిటిషన్..
పూర్వ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. తన నియామకంపై అత్యున్నత న్యాయస్థానం మే 25 న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగమే బేఖాతరు చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తన వ్యవహారంలో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు అమలుకాకపోవటం, అధికారుల వ్యవహారశైలిని పిటిషన్లో ప్రస్తావించారు. తన స్థానంలో ప్రభుత్వం కొత్తగా నియమించిన జస్టిస్ కనగరాజ్ కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎస్ఈసీగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాగే.. ఎస్ఈసీ రవాణా కోసం కేటాయించిన వాహనాన్ని ఇప్పటికీ కనగరాజ్ పరిధిలోనే ఉంచటం సమంజసం కాదని వివరించారు.
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు ఆదేశాల అమలును జాప్యం చేయడంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణిమోహన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే కోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వంపై ధిక్కరణ పిటిషన్ వేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ'... నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలన్న తమ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మూడుసార్లు నిరాకరించినా... ఎందుకు ఆయనను నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మరోవైపు తన పునఃనియామకంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని రమేష్‌కుమార్‌కు కూడా కోర్టు సూచించింది.
సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నిలుపుదలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారించిన అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.