కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కర్ణాటక దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై (ఐఏ) కౌంటర్లు దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది (supreme court ordered that a counter file on Krishna waters). ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్ల పెంపునకు అనుమతిస్తూ కృష్ణా ట్రైబ్యునల్-2 అవార్డు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌కు వ్యతిరేకంగా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఐఏ దాఖలు చేసింది. ఐఏను జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఏ.ఎస్.బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. ‘‘అవార్డు నోటిఫై చేయకపోవడంతో కర్ణాటకకు చెందాల్సిన కృష్ణా జలాలు వృథాగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ అవార్డు మేరకు రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో కిలోమీటర్ల మేర కాలువలు తవ్వించాం. 75 టీఎంసీల నీటి వినియోగంతో 5.94 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులన్నీ పూర్తయ్యాయి. ట్రైబ్యునల్ అవార్డును కేంద్ర ప్రభుత్వం వెంటనే నోటిఫై చేయాలని ఆదేశించండి’’ అని ధర్మాసనాన్ని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవాలి
కర్ణాటకకు 173 టీఎంసీలు ఇస్తే అందులో 130 టీఎంసీల వినియోగం అప్పర్ కృష్ణా మూడో దశ కింద ఉందని, ట్రైబ్యునల్ తీర్పును అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటక దాఖలు చేసిన ఐఏకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదుపరి విచారణలోపు కౌంటరు దాఖలు చేయాలని, ఇదే పిటిషన్‌కు మహారాష్ట్ర దాఖలు చేసిన ఐఏను జత చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పు అమలుపై రెండువారాల్లోగా అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్రకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 29కు ధర్మాసనం వాయిదా వేసింది.
తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్, మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది నార్‌గోల్కర్, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్‌కు కోర్టు అనుమతిస్తే 2013 నవంబరులో బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ 50 శాతం, 65 శాతం, సరాసరి నీటి లభ్యత కింద చేసిన కేటాయింపులు అమలులోకి వస్తాయి.
ఇదీ చూడండి: jal shakti Gazette: 'జల్‌శక్తి గెజిట్ అమలు వేగవంతమయ్యేలా చూడండి'