Ahobilam Temple Case Updates: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని అహోబిల మఠం ఆలయాన్ని చేజిక్కించుకోవాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ నిర్వహణను అహోబిల మఠం, దేవాదాయ శాఖ సంయుక్తంగా చేపడుతున్నాయి. ఆలయంలో సిబ్బందికి విధులు కేటాయించడం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం.. హుండీ ఆదాయాలు, వేలం పాటల నిర్వహణ వంటి పరిపాలన విభాగాలను ప్రభుత్వం నియమించిన ఈవో చూసుకుంటున్నారు. సిబ్బందికి వేతనాలు పెంచడం.. నియామకాలు, తొలగింపులు తదితర పనులు మఠం పెద్దల చేతిలో ఉన్నాయి.
అయితే సిబ్బంది నియామకాలు, వేతనాలు వంటివి రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో సిబ్బందికి వేతనాల పెంపు విషయంలో వివాదం తలెత్తింది. విధులు కేటాయించడంలోనూ కక్ష సాధిస్తున్నారని, వాహన పూజల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి విషయాలపై మఠం నిర్వాహకులు, ఈవోల మధ్య తరచుగా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అహోబిలం ఆలయం తమకే చెందుతుందని గతేడాది.. అటు మఠం, ఇటు దేవాదాయశాఖ హైకోర్టును ఆశ్రయించాయి.
మఠానికే అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు సైతం.. మఠం సాధారణ కార్యకలాపాలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని.. మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని తేల్చి చెప్పింది. సుప్రీంతీర్పుపై పిటిషనర్ హర్షం వ్యక్తం చేశారు. కోర్టులు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో.. అహోబిలం మఠంలో ప్రభుత్వం తలదూర్చకుండా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సహకరించాలని భక్తులు కోరుతున్నారు.
"మఠాధీనమైన ఆలయాలకి.. ఈవోలను వేయడం అనేది లేదు. అహోబిలం మఠానికి.. మఠం వేరు.. గుడి వేరు అంటూ ప్రభుత్వం ఈవోని నియమించింది. మఠ సంప్రదాయం.. దేవాలయంతో విడదీయరానిదిగా ఉంది". - సేతురామన్, పిటిషనర్
ఇవీ చదవండి:
ఘనంగా కుంభాభిషేకం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. భారీగా తరలివచ్చిన భక్తులు
ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి