వానాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు నీరందించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులన్నింటి కింద కలిపి 35 నుంచి 40 లక్షల ఎకరాల వరకు సాగులోకి వచ్చే అవకాశముందని అంచనా వేసింది. ప్రాజెక్టుల్లోకి వచ్చే ప్రవాహాన్ని బట్టి కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనుంది. కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న నిల్వలు, ఇప్పటివరకు ఉన్న ప్రవాహాలను పరిగణనలోకి తీసకుంటే కొంత జాప్యం జరిగినా మొత్తం ఆయకట్టుకు నీరివ్వచ్చని అధికారులంటున్నారు.
ఇప్పటివరకు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలోకి నామమాత్రంగా కూడా ప్రవాహం లేదు. ఆలమట్టిలోకి కూడా ఆశించినంతగా లేకపోగా వచ్చిన నీటిని వచ్చినట్లు సాగుకు వినియోగిస్తున్నారు. ఆలమట్టికి భారీగా వరద వస్తే కానీ ప్రాజెక్టుల ఆశలు చిగురించవు. జూన్ నెల మొత్తం కృష్ణా బేసిన్లో జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల్లోకి కలిపి పది టీఎంసీలు మాత్రమే వచ్చాయి.
గోదావరిలో శ్రీరామసాగర్ మొదలుకుని ఎల్లంపల్లి వరకు రెండు టీఎంసీలు కూడా రాలేదు. వర్షపాతం సాధారణానికి మించి ఉన్నా రిజర్వాయర్లలోకి మాత్రం నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. ఆలమట్టిలకి జూన్‌లో 44.3 టీఎంసీలు రాగా మొత్తం 70 టీఎంసీలు ఉంది. మరో 60 టీఎంసీలు వస్తే ఆలమట్టి నిండుతుంది. దీన్ని బట్టి మొదటి వరదకే ఆలమట్టి నిండే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆలస్యంగా అయినా మొత్తం ఆయకట్టుకు నీరివ్వడానికి అవకాశం ఉందని ఉన్నతస్థాయి కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది.
నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ల సమావేశంలో ప్రాజెక్టుల్లోకి వచ్చే ప్రవాహాన్ని బట్టి నీటి విడుదల తేదీలపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. మొత్తం మీద 35 నుంచి 40 లక్షల ఎకరాల వరకు సాగుకు అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
శ్రీరామసాగర్ కింద 15 లక్షల ఎకరాలకు..
- శ్రీరామసాగర్ కింద కోదాడ వరకు 15 లక్షల ఎకరాలకు నీటినివ్వాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీరామసాగర్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను పరిగణనలోకి తీసుకుని అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా లక్షన్నర ఎకరాల సాగుకు తోడ్పడాలని నిర్ణయించారు.
- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద వానాకాలంలో చెరువులను నింపడంతో పాటు మూడు లక్షల ఎకరాలకు నీరందించే అవకాశముందని అంచనా వేశారు. యాసంగి నాటికి ఎక్కువ ఆయకట్టుకు అందించే అవకాశముంది.
- దేవాదుల ఎత్తిపోతల పథకం కింద చెరువులను నింపడంతో పాటు లక్షన్నర ఎకరాలకు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. అన్ని ప్రాజెక్టు ల్లోనూ గత ఏడాది కంటే నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నాయి.
- జూరాల ప్రాజెక్టు కింద లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణ యించారు. సాగునీటితో పాటు మిషన్ భగీరథ అవసరాలకు కూడా కలిపి 18.27 టీఎంసీలు అవసరమని అంచనాకు వచ్చారు. నెట్టెంపాడు ఎత్తిపో తల కింద లక్షా 30 వేల ఎకరాలు, బీమా కింద లక్షా 70వేలు, ఆర్డీఎస్ కింద 42 వేలు, కోయిల్‌సాగర్ కింద 32వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తారు.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాలువ కింద ఉన్న పూర్తి ఆయకట్టు 6.3 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. గత ఏడాది ఆగస్టు 18న నీటిని విడు దల చేశారు. ఈ ఏడాది లభ్యతను బట్టి తేదీని ఐతారు చేస్తారు. ఎలిమి నేటి మాధవరెడ్డి ఎత్తిపోతల (ఏ ఎంఆర్పి) కింద 2.6 లక్షలు, మూసీ కింద 30వేల ఎకరాలకు ఇస్తారు.