అచ్చుగుద్దినట్లూ ఫొటోలా ఉండే చిత్రలేఖనాన్ని వాటర్ కలర్‌లతో గీయడమే చాలా కష్టం. గీస్తే అది అద్భుతమే. అలాంటిది హై రిజల్యూషన్ ఫొటోలో ఉన్నంత స్పష్టంగా, ఫొటో కాదంటే అస్సలు నమ్మలేనట్లుగా ముగ్గు వెయ్యడం అంటే ఆ కళను కళ్లారా చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కి చెందిన 29 ఏళ్ల ప్రమోద్‌సాహు తన ‘హైపర్ రియలిస్టిక్, త్రీడీ’ ముగ్గులతో ఎంతో పేరు పొందాడు. పిండితో గీత సన్నగా గీస్తూ చుక్కల ముగ్గుని అందంగా వెయ్యడమే గొప్ప. ఇప్పటి అమ్మాయిలైతే ‘నేను గీస్తే ముగ్గు మందంగా పడిపోతుంది. గీతలు వంకరగా వచ్చేస్తాయి. నావల్ల కాదమ్మా’ అనేస్తుంటారు. కానీ ప్రమోద్ చేతుల్లో ఏదో మాయ ఉంది. అతడు ముగ్గు వేస్తే అది ముగ్గులా కాదు కళాఖండంలానే కనిపిస్తుంది. మార్బుల్ పొడితో మనుషుల రూపాల్ని అచ్చుగుద్దినట్లూ ముగ్గులోకి దించుతాడు మరి..
రేగిన తలా అందులో సగం నెరిసిన వెంట్రుకల దగ్గర్నుంచీ కనుగుడ్డు మీద పడిన వెలుతురూ కంటిపాపలోని ఎరుపుదనం... ముఖం మీది ముడుతలూ చీర కట్టులోని మడతలూ... ఒంటి మీది పచ్చబొట్లూ మెడలోని పూసల గొలుసుల వరకూ ప్రతిదాన్నీ ఎంతో స్పష్టంగా అదే రంగూ అదే రూపంతో ఉన్నది ఉన్నట్లుగా వెయ్యగలడు ప్రమోద్. ఇది ఒక ఎత్తైతే... ముఖంలోని విచారాన్నీ కళ్లలోని కోపాన్నీ చూపులోని తీవ్రతనూ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ గాంభీర్యాన్నీ వినోదాన్నీ కూడా మనసుతో చూసి, ముగ్గులో చూపించగలడు. బహుశా దేవుడు అతడి కళ్లల్లో స్కానర్లూ వేళ్లల్లో డిజిటల్ ఫొటో ప్రింటర్లూ పెట్టేశాడేమో.
అలా మొదలైంది..!
పసి వయసులో పిల్లలని ఏదో ఒకటి ఆకర్షిస్తుంటుంది. అలాగే చుక్కనీ చుక్కనీ కలుపుతూ పాములా మెలికలు తిప్పుతూ పూవుల్లా వంపులు తిప్పుతూ గుమ్మం ముందు అమ్మ వేసే రంగోలీ చిన్నతనంలో ప్రమోద్‌ని చాలా ఆకట్టుకునేదట. తనూ కాస్త ముగ్గు తీసుకుని గీతలు గీస్తుండేవాడు. అలా ఏడేళ్ల వయసులో మొదలైన ఆ ఇష్టం వయసుతో పాటే పెరిగింది. ఓ పండుగకి పెద్ద ముగ్గు వేద్దామని మొదలుపెట్టిన అక్క దాన్ని పూర్తిచేసేంత ఓపిక లేదనడంతో ‘నేను వెయ్యనా..?’ అంటూ ఆ ముగ్గుని వాళ్ల అక్క కన్నా చాలా బాగా వేశాడట. అది చూసిన ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోయి తర్వాత ప్రతి పండుగకీ ప్రమోద్‌నే ముగ్గులు వెయ్యమనేవారట. పన్నెండేళ్లు వచ్చేసరికి అతడి ప్రతిభ చుట్టుపక్కల ఇళ్లకీ పాకింది. ‘అయిదు రూపాయలు ఇస్తాం. మా ఇంటి ముందు కూడా అందమైన ముగ్గు వెయ్యి’ అంటూ పిలిచేవారట. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తన ఇష్టాన్ని ఆ వయసులోనే ఆదాయంగా మార్చుకున్నాడు ప్రమోద్. ఆడవాళ్ల పనిచేస్తున్నావంటూ స్నేహితులూ తరగతిలోని పిల్లలూ ఏడిపిస్తున్నా అవేవీ అతడిలోని కళను అడ్డుకోలేకపోయాయి. ‘గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుని రంగులతో దేవుళ్లూ పువ్వులూ జంతువుల బొమ్మలూ డిజైన్లూ వేస్తుంటే మనసుకు చాలా హాయిగానూ తృప్తిగానూఅనిపించేది’ అంటాడు ప్రమోద్ సాహు.
ముగ్గుతోనే ఉపాధి
రంగోలీ వేసుకుంటూనే పిల్లలకు డ్రాయింగ్ క్లాసులు చెబుతూ ఎంఏ పూర్తి చేశాడు. తర్వాత పూర్తిస్థాయిలో ముగ్గుమీదే దృష్టి పెట్టి ఆర్ట్ ఈవెంట్లలోనూ పాల్గొనేవాడు. అద్భుతమైన అతడి కళ జనం దృష్టిలో పడడంతో గుర్తింపూ డబ్బూ రెండూ రావడం మొదలుపెట్టాయి. రాయ్‌పూర్‌లో ‘ఛపాక్’ పేరుతో ఓ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌ని కూడా స్థాపించాడు. నాలుగొందలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఈ సంస్థలో ఏటా పదిమందికి ఉచిత బోధన చేస్తారు. దీంతోపాటు వర్క్‌షాపులూ నిర్వహిస్తుంటాడు ప్రమోద్. స్వచ్ఛందంగా వేసే ముగ్గులు కాకుండా గత పదిహేనేళ్ల నుంచీ దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకోసమే అయిదొందలకు పైగా ముగ్గుల్ని వేశాడట. ఒక్కో రంగోలీ వెయ్యడానికి రెండు నుంచి యాభై గంటల వరకూ సమయం పడుతుందట. ఆ శ్రమకు తగ్గట్లే రూ.10 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ చెల్లిస్తుంటాయి వాణిజ్య సంస్థలు. ముగ్గు వేసేటపుడు ఒక చుక్కవైపు గియ్యాల్సిన గీతను పొరపాటున మరోవైపు గీసుకుంటూ వెళ్తే రంగోలీ అంతా పాడైపోతుంది. అలాంటిది పిండితో పోర్ట్రెయిట్ అంటే ఏ చిన్న తప్పు చేసినా తుడిచేసి మళ్లీ మొదట్నుంచి వెయ్యాల్సిందే. అంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.
ఇంత గొప్ప కళకు అవార్డులు మాత్రం రాకుండా ఎలా ఉంటాయి... ఆల్ ఇండియా ప్లాటినమ్ ఆర్టిస్ట్ అవార్డ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్ర నిర్మాణ్ పురస్కార్... లాంటి ఎన్నో అవార్డులు వచ్చాయి. మూడేళ్ల కిందట రష్యాలో జరిగిన ‘వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్’ కార్యక్రమానికీ ఎంపికయ్యాడు. ఒకప్పుడు బాగా పనితనం ఉన్న కళాకారుల్నీ శిల్పుల్నీ ఆస్థానంలో నియమించుకుని రాజులు గుడులూ గోపురాలూ మహళ్లూ కట్టించేవారు. రాళ్ల మీద చెక్కిన వారి కళ తరతరాలకూ నిలిచిపోయేది.ప్రమోద్ సాహు కళ అలా కాదు,చెరిపేస్తే చెరిగిపోతుంది. కానీ చూసినవారి మనసుల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
ఇదీ చూడండి: 'నీ దగ్గర ఛాయ్ బావుంటుందంటా... నాకు ఇవ్వూ'