జానపదుల ఆటపాటలు.. కళాకారుల వినూత్న ప్రదర్శనలకు నగర రుచులు తోడవడంతో ఆదివారం ట్యాంక్‌బండ్ రెట్టింపు వినోదాలకు వేదికైంది. సాయంత్రం 5 గంటలకు పోలీస్ కళా బృందం ప్రదర్శనలతో ఫన్‌డే వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాయాద్వీపం సెట్టింగ్‌లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు నాగిరెడ్డి వ్యాఖ్యాతగా అలరించారు. పులివేషాలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వారం ప్రత్యేకంగా తందూరీ చాయ్, పాతబస్తీ కబాబ్‌లను ఏర్పాటు చేయడంతో ఆహార ప్రియులు మరింత ఆస్వాదించారు.
గత మూడు వారాలతో పోల్చితే భారీగా సందర్శకులు తరలివచ్చారు. సంచార శౌచాలయాలు, తాగునీటి సదుపాయాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన హెచ్‌ఎండీఏ.. సందర్శకులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేసింది. వారాంతపు విహారానికి వచ్చే కుటుంబాలు, సందర్శకుల కోసం తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. సాయంత్రం 5 గంటలకు పలువురు యువతులు, మహిళలు ఏకరూప దుస్తుల్లో గృహహింసకు వ్యతిరేకంగా చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: రైల్వే వంతెనను స్కూల్‌గా మార్చిన యువతి